హుజురాబాద్ కాంగ్రెస్ లో టికెట్ పోరు
దిశ దశ, హుజురాబాద్:
ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్షన్లు వచ్చే సరికి అభ్యర్థి ఎంపిక సవాల్ గా మారింది. పది రోజుల క్రితం వరకు స్తబ్దంగా ఉన్న హుజురాబాద్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఉప ఎన్నికల అభ్యర్థికే టికెట్ ఖాయమన్న అంచనాలు తలకిందులు అయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా మాజీ ఎంపీ దివంగత సింగపురం రాజేశ్వర్ రావు మనవడు ప్రణవ్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మారిన రాజకీయాలు…
ఈ నెల 6 వరకూ కూడా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకటే ఉంటాడని భావించారంతా. ఆయన సన్నిహితులకు కూడా ఇదే విషయం చెప్తూ అభ్యర్థుల ప్రకటన తరువాత టికెట్ నియోజకవర్గం అంతా కలియతిరుగుతానన్నారు. కానీ అనూహ్యంగా 6వ తేదిన వొడితెల ప్రణవ్ బాబు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. గత మూడేళ్లుగా నియోజకవర్గ ప్రజలతో టచ్ లో ఉంటున్న ప్రణవ్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గం అంతటా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే బరిలో నిలుస్తారన్న ప్రచారం కూడా హుజురాబాద్ లో ఊపందుకుంది. ఆయన కూడా జాతీయ నాయకులతో ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తనతాత కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న విషయాన్ని వివరించడంతో పాటు ఏఐసీసీ ప్రముఖులకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు కూడా ప్రణవ్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతున్నారు. ఢిల్లీ పెద్దల వద్ద ప్రణవ్ కు అవకాశం ఇచ్చినట్టయితే అన్నింటా లాభంగా ఉంటుందని కూడా వివరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రణవ్ బాబు తన తాతకు సంబంధించిన ఇంట్లో ఇంతకాలం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఖాలీ చేయించి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుగా మార్చేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని తన సన్నిహితులతో పాటు తన కుటుంబంతో అనుబంధం ఉన్నవారితో మంతనాలు కూడా జరుపుతున్నారు ప్రణవ్. అయితే బల్మూరి వెంకట్ మాత్రం ఖచ్చితంగా టికెట్ తనకే వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తుడడం గమనార్హం. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనకు అధిష్టానం అవకాశం ఇచ్చిందని, జనరల్ ఎన్నికల్లోనూ తన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేస్తుందని వెంకట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్ యూఐ స్టేట్ ప్రసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నందను విద్యార్థి సంఘం కోటాలో తనకు అవకాశం లభించే అవకాశం ఉంటుందని ఘంటా పథంగా వెంకట్ చెప్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా వెంకట్ కే ఉన్నాయని కూడా ఆయన అనుచరులు వాదిస్తున్నారు. ప్రణవ్ బాబు చేరిక తరువాత వెంకట్ ను కూకట్ పల్లి నుండి బరిలో నిలిపే అవకాశం ఉందని ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందన్న ప్రచారం కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సాగింది. అయితే వెంకట్ మాత్రం అలాంటిదేమీ లేదని హుజురాబాద్ టికెట్ తనకే కెటాయిస్తారని చెప్తుండడం గమనార్హం. హుజురాబాద్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారోనన్నది మాత్రం అధిష్టానం చేతుల్లో ఉన్నప్పటికీ గత పది రోజులుగా మాత్రం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి.