ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వాస్తు ‘దోస్తీ’ చేయడం లేదా..?

దిశ దశ, హుజురాబాద్:

రాష్ట్రంలోనే సంచలన రాజకీయాలకు వేదికైందా నియోజకవర్గం… ముఖ్యమంత్రి నుండి సామాన్య కార్యకర్త వరకు ఆరు నెలల పాటు ఆ ప్రాంతంపైనే దృష్టి సారించారు. జాతీయ నాయకులు కూడా అంతా అక్కడ గెలుపే లక్ష్యంగా పని చేశారు. ఒక దశలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అక్కడ జరిగిన ఉప ఎన్నికలపై చర్చలు జరిగాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వాస్తు అక్కడి నుండి గెలిచిన ఎమ్మెల్యేలను వెంటాడుతున్నట్టుగా ఉంది. అందులోకి వెల్తే పతనం ఖాయం అన్న రీతిలో అక్కడి నాయకులు చర్చిస్తున్నారు. దీంతో మరోసారి రాష్ట్రంలో చర్చకు దారి తీస్తోంది.

హుజురాబాద్…

2021లో అనూహ్య పరిణామాలతో గులాభి పార్టీ నుండి హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన హుజురాబాద్ ఎస్సారెస్పీ క్యాపు ఏరియాలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు భవనంలో నివాసం ఉండడమే ఇందుకు కారణమన్న చర్చ తాజాగా మొదలైంది. 2020 ఆగస్టులో ఈ క్యాంప్ ఆఫీసులోకి తన నివాసాన్ని మార్చుకున్నారు. 2021లో ఆయన మంత్రివర్గం నుండి బర్తరఫ్ కావడం ఉద్యమ పార్టీకి, ఎమ్మెల్యేకు రాజీనామా చేశారు. ఆ తరువాత ఈ క్యాంపు ఆఫీసు ఖాలీ చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత మళ్లీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి మారడంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓబమి పాలయ్యారన్న వాదనలు మొదలయ్యాయి. తాజాగా ఆయనపై గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ కార్యాలయంలోకి అడుగు పెట్టేందుకు సాహసించడం లేదు. వాస్తు పండితుల సలహాలు సూచనలు తీసుకుంటున్న ఆయన వాస్తు దోషాలు సవరించిన తరువాతే అందులోకి మారాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఆగ్నేయం… వాయువ్యం…

హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు భవనం ఆగ్నేయం, వాయువ్యం దిశల్లో నిర్మాణాలు సరిగా జరగకపోగా ఈశాన్యం భాగంలో తగ్గిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ కారణంగానే ఇందులో నివసించిన వారు ఇబ్బందులు పడక తప్పడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో వాస్తు దోషాలను సవరించేందుకు ఈశాన్య భాగంలో ప్రత్యేకంగా ద్వారాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆగ్నేయం, వాయువ్య ప్రాంతాల్లో నిర్మాణం సైజు తగ్గకపోవడం, ఎలివేషన్ కూడా లేకపోవడం వంటి కారణాలు మాత్రం అందులో నివసించే వారికి లేనిపోని తలనొప్పులు తీసుకొస్తాయని అంటున్నారు వాస్తు నిపుణులు. ఇందుకు సంబంధించిన మార్పులు, చేర్పులు చేయనట్టయితే సమస్యలు యథావిధిగా వెంటాడుతాయన్న అనుమానం బలంగా నాటుకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని సవరించాల్సి ఉందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి తాజా ఎమ్యెల్యే కౌశిక్ రెడ్డిని కూడా వెళ్లవద్దని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన కూడా ఇందులోకి షిప్ట్ అయ్యేందుకు వెనకడుగు వేస్తున్నట్టుగా సమాచారం. ప్రజా క్షేత్రంలోకి వేల్లేందుకు కూడా గ్రహ బలాన్ని చూసే ఆనవాయితీ కొనసాగించే రాజకీయ నాయకులు ఐధేళ్ల పాటు నివసించాల్సిన క్యాంపు ఆఫీసు భవనం విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారని అంటున్నారు స్థానిక నాయకులు. అయితే వీటన్నింటిని సవరించేందుకు ప్రత్యేకంగా నిధులు కెటాయింపు ఎలా అన్నదే ఇప్పుడు అసలు సమస్యగా మారిపోనుంది ఇంజనీరింగ్ విభాగం అధికారులకు. భవనం రిపేర్ల పేరిట నిధులు కెటాయించాలన్న ప్రతిపాదనలు చేస్తే ఐదేళ్లలోనే మరమ్మత్తులు చేసే పరిస్థితి రావడం ఏంటన్న అనుమానం ఉన్నతాధికారులకు వస్తుంది. వాస్తు కారణంగా బాగు చేయడానికి నిబంధనలు సహరించే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఈ క్యాంప్ ఆఫీసు భవనంలో వాస్తు సవరించడం ఎలా అన్నదే పజిల్ గా మారిపోయిందని తెలుస్తోంది.

You cannot copy content of this page