దిశ దశ, హైదరాబాద్:
యూనిఫాం వేసుకుని నేతల ఇండ్ల చుట్టు తిరిగే పరిస్థితికి చెక్ పడబోతోందా..? శాంతి భద్రతల పరిరక్షణ పక్కన పెట్టేసి పోస్టింగుల కోసం అర్రులు చాచే దీనస్థితికి బ్రేకులు పడనున్నాయా..? పొలిటికల్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ (పీఐఆర్)గా రూపాంతరం చెందిన ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఆర్) తన అస్థిత్వాన్ని నిలుపుకునే పరిస్థితికి చేరుకోబోతోందా అంటే అవుననే అనిపిస్తున్నాయి పోలీసు అధికారుల చర్యలు గమనిస్తుంటే. ఇటీవల సీపీల పోస్టింగులతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలన తీరు ఎలా ఉండబోతుందో చేతల్లోనే చూపిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నతాధికారుల బదిలీల విషయంలో కఠినంగా ఉన్నా క్షేత్ర స్థాయి అధికారుల పోస్టింగుల విషయంలో పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఉంటుందన్న చర్చ మాత్రం పోలీసు యంత్రాంగంలో కొనసాగింది. కొంతమంది అధికారులు కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే పనిలో కూడా పడ్డారు. తాజాగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఝలక్ తో పోలీసు యంత్రాంగంలో నెలకొన్న అనుమానాలన్నింటికి పుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరి కోరి మరీ కొత్తకోటను హైదారాబాద్ సీపీగా ఎంపిక చేసిన తరువాతే అంచనాలన్ని తలకిందులయ్యాయన్న వాదనలు వినిపించాయి. అయితే తాజాగా ఆయన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగానికి ఇచ్చిన వార్నింగ్ సరికొత్త సంకేతాలను పంపించింది. సిఫార్లు లేఖలు, పోస్టింగుల కోసం పైరవీలు చేస్తే సహించేది లేదని సీపీ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా సిఫార్సు లేఖలు తీసుకొచ్చే వారి గురించి అన్యూవల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్)లో రాస్తామని దీంతో ప్రమోషన్లకు ఛాన్స్ ఉండదని సీపీ శ్రీనివాస్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. దీంతో పొలిటిల్ పైరవీలపై ఆధారపడ్డ కొంతమంది ఇన్స్ పెక్టర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. తమ పోస్టింగ్ ఉంటుందో ఊడుతుందో అన్న టెన్షన్ ఒక వైపు… తాము ఫలానా నాయకుడి వద్దకు వెల్లొచ్చామని సీపీకి తెలిస్తే ఎలాంటి పరిణామాలు ఎధురవుతాయోనన్న ఆందోళణ మరో వైపు స్టార్ట్ అయిందన్న ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో పోస్టింగుల విషయంలో రికమండేషన్లకే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించడంతో పోలీసు వ్యవస్థ అంతా ఎమ్మెల్యేల ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి తయారైందన్న వాదనలు వినిపించాయి. తమ పోస్టింగ్ విషయంలో కనికరించిన ఎమ్మెల్యేను ప్రాపకం చేసుకునేందుకే పోలీసు యంత్రాంగం అంతా పరిచేయాల్సి వచ్చింది. దీంతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకుందన్న అభిప్రాయాలు ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద వ్యక్తం అయ్యాయి. ప్రతి పోస్టింగ్ కూడా ఇలాగే కొనసాగడంతో శాంతి భద్రతలు కూడా చేజారిపోయే స్థితికి చేరుకోవడం ఆందోళన కల్గించింది. అంతేకాకుండా అక్రమార్కులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుంటే సరిపోతుందన్న ధీమాతో కాలం వెల్లదీశారు. దీంతో సామాన్యుడికి చేరువ కావల్సిన పోలీస్ స్టేషన్ల సేవలు తిరోగమనం వైపు పయనించాయి. అయితే తాజాగా హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి చేసిన హెచ్చిరికలతో పోలీసు విభాగంలో హాట్ టాపిక్ అయిందనే చెప్పాలి. ఇంతకాలం పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చిన పోలీసు అధికారులు ఇక నుండి పనితీరే ప్రామాణికతగా పోస్టింగులు వస్తాయి తప్ప మరో దారి చూసుకోకూడదని స్పష్టం అయింది.
సీఎం కూడా సీరియస్..!
లా అండ్ ఆర్డర్ తో పాటు ఇతరాత్ర విభాగాల్లో పోస్టింగుల విషయంలో పైరవీలకు తావివ్వకూడదన్న యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ… రికమండేషన్లు చేయకపోతేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పోస్టింగుల విషయంలో సీఎం నుండి ఎలాంటి సంకేతాలు రాలేదని తాము జోక్యం చేసుకోవడమా లేక వదిలేయడమా అన్న విషయంపై క్లారిటీ రావడం లేదని ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పోలీసు అధికారులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకరావడమే కాకుండా తమ ప్రచారస్త్రాంగా వాడుకున్న ఇసుక మాఫియా, రికమండేషన్ పోస్టింగులు వంటి అంశాల్లో తల దూర్చకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసు బాసులకు ఫ్రీ హైండ్ ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నందు వల్లే హైదరాబాద్ సీపీ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా…
అయితే హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, పారదర్శకమైన సేవలు అందించే వారికి పోస్టింగుల్లో పోలీసు అధికారులే నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ మొదలైంది. ఇదే విధానం అమలు చేసినట్టయితే పరిపాలనలో గత కాలపు పద్దతుల్లో అధికార యంత్రాంగం పనిచేసుకుంటూ పోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ప్రభుత్వంపై ప్రజల్లో సరికొత్త నమ్మకం ఏర్పడనుందని అధికార వర్గాలు అంటున్నాయి.