దిశ దశ, పెద్దపల్లి:
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు తన మనసులోని మాటను బయట పెట్టారు. తమ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకో ఆశ ఉండేనన్నారు. పెద్దపల్లి జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అవుతారని ఆశించానన్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అది శ్రీధర్ బాబుకు ఒక్కరికేనని భాను ప్రసాద్ రావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో పరిశ్రమలు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఐటీ పార్క్ కూడా ఏర్పాటు చేసేందుకు పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీధర్ బాబు హయంలో ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలను మార్చాలనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అయితే పెద్దపల్లిని మారిస్తే ఉద్యమాలు చేసి తీరుతామని ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు స్ఫష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటు చేసేందుకు తాము అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించడానికి ఎంతో శ్రమించామన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ జిల్లాలను మార్చేందుకు నిర్ణయించుకున్నందున ఈ జిల్లాను మార్చకుండా చూడాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని మార్చినట్టయితే మాత్రం శ్రీధర్ బాబుతో ఉన్న సాన్నిహిత్యన్ని కూడా పక్కన పెట్టి ఉద్యమానికి శ్రీకారం చుడుతామని భాను ప్రసాద్ రావు వెల్లడించారు.