నేను ఇంతవరకూ ఏ పార్టీ మారలేదు…

నా కోసం కేసీఆర్ కుటంబం ఏడ్చింది…

బీజేపీని వీడే ప్రసక్తే లేదు…

ఈటల సంచలన వ్యాఖ్యలు

దిశ దశ, హైదరాబాద్:

తాను ఇంతకాలం ఏ ఒక్క పార్టీ కూడా మారలేదని, ఇప్పుడున్న పార్టీని వీడే ప్రసక్తే లేదని బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం శామీర్ పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చేసిన ఈ వ్యాఖ్యలు గతంలోనూ చేశానన్నారు. 20 ఏళ్లుగా కొనసాగిన పార్టీలోంచి తనను వెల్లగొట్టారు తప్ప అందులోంచి బయటకు రావాలని నేను అనుకోలేదని, వాళ్లు వెల్లగొడ్తే తనను బీజేపీ అక్కున చేర్చుకుందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యంగా ఉన్న తనను బయటకు పంపించినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు పెట్టుకుని ఉంటారని ఈటల వ్యాఖ్యానించారు. అయితే తాను బీజేపీని వీడే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్న విషయాన్ని కొట్టి పారేశారు. క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరిగినప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని ఈ విధామైన నిర్మాణం బీజేపీలో మాత్రమే ఉందన్నారు. అయితే అన్ని రాజకీయ పార్టీల్లో అభిప్రాయ బేధాలు సహజమని వీటిని పరిష్కరించుకునేందుకు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు చాలా తేడా ఉంటుందన్నారు. ప్రాంతీయ పార్టీల అధి నాయకత్వం రాష్ట్ర రాజధానిలోనే ఉంటుందని దీంతో అభిప్రాయ బేధాలు వెంటనే పరిష్కారం అవుతాయని, జాతీయ పార్టీలకయితే కీలక నాయకత్వం ఢిల్లీలో ఉంటున్నందున వాటిని పరిష్కరించుకునేందుకు అక్కడి వరకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిప్రాయ బేధాలు సమసిపోయేందుకు జాతీయ పార్టీల్లో కొంతమేర ఆలస్యం కావడం సహజమేనని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు తానెప్పుడు ప్రయత్నించ లేదని, నాయకత్వం పిలిచినప్పుడు మాత్రమే వారి వద్దకు వెల్లానని స్ఫష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి తాను నేషనల్ లీడర్స్ ముందు చర్చించానే తప్ప వ్యక్తిగత విషయాలను లేవనెత్తలేదని, అలాంటి వ్యక్తిత్వం కూడా తనది కాదని ఈటల కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రంలో అధికారమే పరమావధిగా బీజేపీ నాయకత్వం పనిచేస్తున్నదని ఇందులో భాగంగానే తమవంతు బాధ్యతలు నిర్వర్తిస్తామని తేల్చి చెప్పారు. పార్టీల్లో గందరగోళం సృష్టించిడం అందులో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రలోభాలకు గురి చేయడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడుతున్నారని రాజేందర్ మండిపడ్డారు. నేడు ప్రజల చేతికి చిక్కి తానే మాయమైపోయే పరిస్థితి కేసీఆర్ కు వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదన్న చర్చ అన్ని వర్గాల్లో జరుగుతోందన్నారు. రైతు బంధు ఆసరా, కళ్యాణలక్ష్మీ లబ్దిదారులపై ఆశలు పెట్టుకున్నారని, అయితే నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలని, పంటకు గిట్టుబాటు ధర రావాలని, తరుగు పేరిట జరుగుతున్న మోసంతో దగాకు గురవుతున్నామని, అమ్మిన ధాన్యానికి డబ్బులు సకాలంలో రావడం లేదని రైతాంగం, సామాన్య జనం కేసీఆర్ కు ఓటు వేయొద్దని నిర్ణయించుకున్నారన్నారు. రాష్ట్రంలో 35 శాతం ఉన్న కౌలు రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారన్నారు. తెలంగాణ మోడల్ పాలన తీసుకొస్తున్నాని ఇతర రాష్ట్రాల్లో ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి ఇక్కడి కౌలు రైతులకు, మహిళలకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు గ్రామ స్థాయి నుండి ఐఏఎస్ ల వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా కూడా నైరాశ్యంలో కూరకపోయారన్నారు. ధరణి తరువాత పేదల భూములు మాయమైపోయాయని, అసైన్ ల్యాండ్స్ వివరాలే అదృశ్యం అయ్యాయని ఆరోపించారు. తమ లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపాలన్నదేనని అదే ఏకైక ఏజెండాగా ముందుకు సాగుతామని ఈటల వ్యాఖ్యానించారు. సుపారి గ్యాంగులతో చంపించే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించిన ఈటల రాజేందర్ తనకు ప్రజలే రక్షణ కవచంలా ఉంటారన్నారు.

You cannot copy content of this page