యాస… భాషపై మమకారం అంటే ఇదేనేమో…
ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్…
దిశ దశ, జాతీయం:
ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్విసెస్ అధికారిగా ఇతర రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్నారాయన. తెలంగాణ గడ్డపై పుట్టి ఇక్కడే పెరిగి ఐఏఎస్ కు సెలెక్ట్ అయి… సరికొత్త పథకాల రూపశిల్పిగా పేరొందిన ఆయన జన్మభూమిపై ఉన్న మమకారాన్ని ఏ మాత్రం తగ్గించుకోలేదు. అమ్మతనంలోని కమ్మదనాన్ని అస్వాదించిన ఆయన జన్మనిచ్చిన ప్రాంత భాష యాసకు దూరం కాలేదు. అత్తాండు… పోతాండు… ఏందే… ఏమైందే… అన్న పదాలు వినగానే మోటు మాటలంటూ సూటిపోటిగా పొడుస్తున్న జనరేషన్ ఇది. కానీ తెలంగాణలోని పల్లెల్లో వాడుకలో ఉన్న పదాల పొందికతో రచించిన ఓ పాట ఆ ఐఏఎస్ అధికారిని ఎంతలా ఆకట్టుకుందో తెలుసా..?
పరికిపండ్ల…
పరికిపండ్ల నరహరి మధ్య ప్రదేశ్ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. తెలంగాణలోని జమ్మికుంట ప్రాంతానికి చెందిన ఆయన కుటుంబం రామగుండం సమీపంలోని బసంత్ నగర్ వద్ద జీవనం సాగించింది. ఉన్నతాధికారిగా తాను పనిచేస్తున్న ప్రాంతానికే సేవలందించడంతోనే సరిపెట్టే మనస్తత్వం కాదాయనది. తాను పుట్టిపెరిగిన ప్రాంత బిడ్డలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కన్న వ్యక్తి. ఈ రోజు మోటివేషనల్ స్పీకర్లు విపరీతంగా పెరిగిపోయారు కానీ… దశాబ్దాల క్రితమే వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణాలోని విద్యార్థులతో తన భావాలను పంచుకునే ప్రయత్నం చేశారు. ఓ వైపున తన విధులు నిర్వర్తిస్తూనే తన ప్రాంత బిడ్డల కోసం సమయం కెటాయించేందుకు ప్రణాళికబద్దంగా సాగుతుంటారు. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తెలంగాణ ప్రాంతానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
నచ్చిన పాట…
సాదారణంగా ఐఏఎస్ ఆఫీసర్లపై వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటూ… వారికి కెటాయించిన విభాగాల ద్వారా అందించే సేవలపై మానిటరింగ్ చేస్తూ… తమపై అధికారుల ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తమ ఆలోచనలను మల్చుకోవడంతో పాటు అందుకు అనుగుణంగా నడుచుకోవల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న పరికిపండ్ల నరహరి సీనియర్ ఆఫీసర్ గా అక్కడి ప్రజలకు సేవలందించే పనిలో నిమగ్నం అయ్యారు. బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన తెలంగాణ భాష, యాసపై రచించిన ఓ పాట గురించి విశ్లేషించిన తీరు అద్భుతమనే చెప్పాలి. పల్లె పదాల పొందికపై ఆయన విశ్లేషించిన తీరు, కనుమరుగవులున్న తెలంగాణ జానపదాల్లో వినిపించిన బాణీ గురించి చెప్పుకొచ్చారంటే ఆయన తనప్రాంత భాషపై ఎంతటి పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘‘దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు — దారిద్దునా వోనిద్దునా
జోరు మీదత్తుండు కారు మీదత్తుండు — తోలేద్దునా పోని ఊకుందునా’’ అన్న పాటను అసాంతం విని మరీ దాని గురించి విశ్లేషించారు. X వేదికగా సీనియర్ ఐఏఎస్ ఆపీసర్ పరికిపండ్ల నరహరి ఈ పాటపై తనలోని భావాలను షేర్ చేసుకున్నారు. మోటు మాటల వెనక ఉన్న నిగూఢత… తెలంగాణ పల్లె పదాల్లో దాగి ఉన్న అర్థం యోక్క పరమార్థాన్ని వివరించిన తీరు గురించి నేటి తరం తెలుసుకోవల్సిందే. ఆధునిక పోకడల ముసుగులో మాతృ భాషను విమర్శిస్తున్న నేటి తరం సీనియర్ ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన పరికిపండ్ల నరహరి తెలంగాణ పల్లె పదాల అల్లికలపై పంచుకున్న తీరు గురించి ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి…
https://x.com/pnarahari/status/1893972297935208791