దిశ దశ, కరీంనగర్:
జాతీయ బ్యాంకులో పనిచేసిన ఆయన సామన్యులకు ఓ భరోసాగా నిలిచారు. సమాజాన్ని దోపిడీ చేసే వారు ఎంతటి వారే అయినా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. బాధితులకు బాసటనివ్వడమే కాదు ఉద్యమాలను ముందుండి నడిపించారు. మూడేళ్ల క్రితం మహమ్మారి కరోనా కారణంగా తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. సామాన్యులకు అసామన్యమైన సేవలందించిన ఓ సాదా సీదా హక్కుల ఉద్యమ నేత గురించి కరీంనగర్ సమాజమంతా కూడా చర్చించుకుంటోంది. యూనియన్ బ్యాంకులో పనిచేస్తూ వినియోగదారుల కోసం పోరాటం చేసిన శ్రీనివాస్ ఇంటిపేరు నరెడ్ల అయినప్పటికి వినియోగదారుల మండలి శ్రీనివాస్ సార్, లోక్ సత్తా శ్రీనివాస్ సార్ అంటేనే ఠక్కున అందరికి గుర్తుకు వస్తారు. ఆ స్థాయిలో సేవలందించిన ఆయన చివరి వరకు కూడా బాధితుల పక్షాన నిలబడి ఉద్యమాలు చేశారు. తాజాగా కరీంనగర్ లో వెలుగులోకి వస్తున్న భూ దందాల విషయంలో బాధితులకు అవసరమైన విధంగా గైడ్ చేసేందుకు వెన్నుదన్నుగా నిలిచేవారు లేకుండా పోయారు. ఆయనే ఉన్నట్టయితే బాధితులకు జరిగిన అన్యాయం ఏంటీ..? నిందితులపై తీసుకోవల్సిన చర్యలు ఏంటీ అన్న విషయాలపై ఆ గొంతుకు నినదించేది. కరీంనగర్ లో వేలాది మంది బాదితులకు శ్రీనివాస్ సార్ భరోసాగా నిలిచాడన్నది వాస్తవం. వినియోగదారుల మండలి ద్వారా బాధితులకు లక్షల్లో పరిహారం ఇప్పించడంలో చరిత్ర సృష్టించారు శ్రీనివాస్ సార్. సమాచార హక్కు చట్టాన్ని అందిపుచ్చుకుని సామాన్యులకు న్యాయం జరిగే వరకు అస్త్రాలను ప్రయోగిస్తూనే ఉండే వారు. రిటైర్ అయిన తరువాత కూడా ప్రత్యేకంగా ఆపీసు ఏర్పాటు చేసి బాధితులకు బాసటగా నిలిచారు. కరీంనగర్ జిల్లాలో సంచలనం కల్గించిన గ్రానైట్ కుంభకోణంలో బడా బాబుల వెన్నుదన్నులు ఉన్నాయని తెలిసి కూడా వెనక్కి తగ్గకుండా చట్టాలకు అనుగుణంగా పోరాటం చేపట్టారు. రాష్ట్రంలోనే సంచలనం కల్గించిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఫైనాన్స్ కేసులో అయినా, బొమ్మకల్ భూ దందాలో సర్పంచ్ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా అయినా ఇలా ప్రతి అంశంలోనూ శ్రీనివాస్ సార్ ఉద్యమాలు చేశారు. అక్రమాల తంతు మొదలైందంటే చాలు బాధితులు శ్రీనివాస్ వద్ద వాలిపోయి తమ గోడు చెప్పుకునే వారు. ఆర్థికపరమైన ఆశలు లేకుండా సామాజిక సేవే తన లక్ష్యం అని చేతల్లో చూపించిన నరెడ్ల శ్రీనివాస్ కు తెలంగాణాలోనే ప్రత్యేక పేరు ఉంది. బాధితుల పక్షాణ ఎందుకు సార్ మాతో చేతులు కలపండి లేదంటే… మా కేసును విడిచిపెట్టండి భారీగా ముట్టచెప్తామంటూ ఆయనను మచ్చికు చేసుకునే ప్రయత్నం చేసినా నో అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సర్కారు కొలువుల్లో ఉంటూ అక్రమార్జన కోసం అర్రులు చాచిన అధికార యంత్రాంగాన్ని ఏసీబీకి పట్టించిన వారిని ప్రోత్సహించే సంస్కృతికి కూడా శ్రీకారం చుట్టారు శ్రీనివాస్. అవినీతి పరులను ఏసీబీకి పట్టించిన వారికి ప్రత్యేకంగా సన్మానం చేసే కార్యక్రమానాన్ని నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. బాధితుల హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీనివాస్ 2021 ఫిబ్రవరి 15న కరోనా బారిన పడి మరణించారు.
ఆయన లేని లోటు…
లోక్ సత్తా శ్రీనివాస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్న చర్చ కరీంనగర్ లో వినిపిస్తోంది. సీపీ అభిషేక్ మహంతి భూ దందాలకు పాల్పడిన అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న ఈ సమయంలో ఆయన కూడా ఉంటే బాధితుల సమస్యలు మరింత వెలుగులోకి వచ్చేవన్న చర్చ మొదలైంది. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని కటకటాలకు పంపిస్తున్న ఈ సమయంలో శ్రీనివాస్ జీవించి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఓ బాదిత సంఘం ఏర్పాటు అయ్యేదని వారి గోడును అంతా కూడా బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడమే కాకుండా వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేసేవారు. శ్రీనివాస్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వారే లేకపోవడంతో బాధితుల పక్షాన పోరాటం చేసే వారు కానరావడం లేదన్న అభిప్రాయాలు కరీంనగర్ లో వినిపిస్తున్నాయి.