ఇసుక దోపిడీపై ఆరా… టోల్ గేట్ల వారిగా వివరాల సేకరణ…

సహజ వనరుల దోపిడీపై ప్రత్యేక దృష్టి

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

దిశ దశ, హైదరాబాద్:

అంతా మా ఇష్టం… సర్కారుకు రెవెన్యూ ఇస్తున్నాం… మేమేం చేసినా చెల్లుతుందన్నట్టుగా వ్యవహరించిన టీఎస్ఎండీసీ వ్యవహారం ఎట్లకేలకు బట్టబయలు కానుంది. దశాబ్ద కాలంగా ఇసుక దోపిడీ పేరిట చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. జిరో వే బిల్లుల దందా, ఓవర్ లోడ్ పేరిట దోపిడీ, నదుల్లో ఇష్టారీతిన తవ్వకాలు, బ్రేక్ డౌన్ దందా ఇలా ఒక్కటా రెండా ఎన్ని దారులు దొరికితే అన్ని రకాల దోపిడీలకు పాల్పడ్డారు.

సర్కారు ఆదాయం పేరిట…

సర్కారుకు ఆదాయం వందల కోట్లలో వస్తుందోన్న బూచిలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఇసుకాసురుల కారణంగా సాగిన సహజ వనరుల విధ్వంసం… నదీ తీర వాసుల జీవన విధానానికే సవాల్ విసిరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక విధానంలో మార్పులు చేర్పులు తీసుకరావాలని ఆదేశించడంతో కొత్త పాలసీ తయారు కానుంది. ఇసుక అక్రమాలపై విజిలెన్స్, ఏసీబీ అధికారులచే ప్రత్యేకంగా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని ఆదేశించారు. దీంతో ఇసుక మాఫియా చేసిన ఆగడాలు పూర్తి స్థాయిలో కాకున్నా కొన్నైనా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే పక్కాగా ఉన్నాయి. ఏపీ, తమిళ నాడు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇసుకపై అనుసరిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసి నూతన పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు.

48 గంటల డెడ్ లైన్…

ఇసుక వ్యవహారాలతో సంబంధం ఉన్న అధికార యంత్రాంగానికి కూడా ముఖ్యమంత్రి డెడ్ లైన్ విధించారు. 48 గంటల్లో తమ పద్దతులు మార్చుకోవాలని హెచ్చరించిన ఆయన ఆ తరువాత నుండి విజిలెన్స్, ఏసీబీ అధికారులు రంగంలోకి దింపి ఇసుక మాఫియా అక్రమాల గుట్టు లాగాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లోనూ ఈ విచారణ చేపట్టి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవల్సిందేనని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా వివరాలు సేకరించడంలో భాగంగా టోల్ గేట్లలో నమోదైన డాటా ఆధారంగా ఇసుక అక్రమ రవాణా చేసిన లారీల వివరాలు సేకరించాలన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న ఇసుక రీచులు, స్టాక్ యార్డులను కూడా పరిశీలించి తప్పని తేలితే జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సీసీ కెమెరాలేవీ..?

ఇసుక రీచుల వద్ద సీసీ కెమరాలు ఉన్నాయని ఆ ఫుటేజీ చూస్తే తేలిపోతుందని అధికారులు సర్ది చెప్పబోగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తాను పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు వెల్లినప్పుడు తనుగుల మానేరు నది రీచుకు వెల్లినప్పుడు సీసీ కెమెరాలు లేవని తాను గమనించినట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ నెల3న రవాణా విభాగం అధికారులతో నిజామాబాద్, వరంగ్ల రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయిస్తే 83 లారీల్లో 22 లారీలకు పర్మిట్లు లేవని తేలిందన్నారు. ఒక పర్మిట్ ను వినియోగిస్తూ ఒకటే నెంబర్ వేసిన లారీలు నాలుగైదు పట్టుబడ్డాయన్నారు. ఈ తనిఖీల్లో వెల్లడైన విషయాలను గమనిస్తేనే 25 శాతం ఇసుక అక్రమంగా తరలిపోతుందని అంచనా వేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి, గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అధికార యంత్రాంగం కూడా హాజరైంది.

You cannot copy content of this page