తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు
దిశ దశ, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంక్షేమ ఏర్పడింది. ఈ సంఘ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కొట్రంగి తరుణ్ సో్మవారం ఎక్సైజ్ సూపరింటిండెంట్ ను కలిసి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తరుణ్ చేసుకున్న దరఖాస్తులో జిల్లాలోని వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ బీర్లు లభ్యం కావడం లేదని వాటిని అందుబాటులో ఉంచేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. గత 18 రోజుల్లో ప్రభుత్వానికి రూ. 670 కోట్ల ఆదాయాన్ని తీసుకరావడం ఆనందంగా ఉందని, అయితే కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు విక్రయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తరుణ్. ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్నా కొద్ది యువకులు, పెద్దలు దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురువుతున్నారని తరుణ్ వివరించారు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు కేవలం మంచిర్యాల జిల్లాలోనే కాకుండా కుమరం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో కూడా ఈ బ్రాండ్ బీర్లు దొరకడం లేదన్నారు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగడం వల్ల మత్తు తక్కువ సమయమే ఉంటుందని, ఆ తరువాత తమ పనులు తాము చేసుకునే వీలు ఉంటుదన్నారు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటి బారిన పడుతున్నామన్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి చల్లని కింగ్ ఫిషర్ లైట్ బీర్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని తరుణ్ కోరారు. కింగ్ ఫిషర్ బీర్ తాగే ప్రతి ఒక్కరి తరుపున తామీ అభ్యర్థన చేస్తున్నామన్నారు. వీటిని అందుబాటులోకి తెచ్చి తమకు సహకరించినట్టయితే రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసేందుకు కృషి చేస్తామని కూడా వెల్లడించారు. కొన్ని వైన్ షాపులు సిండికేట్ అయి కింగ్ ఫిషర్ లైట్ బీర్లలో తక్కువ మార్జిన్ ఉంటుందని వాటిని అమ్మకుండా కొత్త రకం బీర్లను అలవాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతి లేక తాము వాటిని తాగాల్సి వస్తుందని దానివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉందన్నారు. రాష్ట్ర ఆదాయం కోసం ఆరోగ్యాలను సైతం లెక్క చేయని తమకోసం కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.