ప్రజావాణిలోనూ డబుల్ ఇళ్ల పంచాయితీ తప్పడం లేదు. తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదంటూ ఆశావాహులు జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించారు. తాము ఇప్పటికి పది సార్లు దరఖాస్తు చేసుకున్న డబుల్ ఇండ్లు మాత్రం కెటాయించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ తమకు డబుల్ ఇండ్లు మాత్రం కెటాయించడం లేదంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన లబ్దిదారుల జాబితాలో తమ పేర్లు లేవని తమకు అన్యాయం చేశారంటూ వారు ఆశావాహులు వివరించారు. ఒక్కసారిగా మహిళలు ప్రజావాణికి చేరుకుని తమ గోడు వెల్లబోసుకోవడంతో ప్రజా వాణి నిర్వహిస్తున్న ప్రాంతమంతా గందరగోళంగా మారింది.
స్పెషల్ కౌంటర్…
డబుల్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు బాధితులు ఎవరైనా ఉన్నట్టయితే వారంతా కూడా జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష సూచించారు. అలాగే డబుల్ ఇళ్లకు సంబందించిన వినతులు స్వీకరించేందుకు డివిజన్ కార్యాలయంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.