చారిత్రాత్మక భవనం బెటర్
దిశ దశ, హైదరాబాద్:
ప్రగతి భవన్ కాస్తా ప్రజా భవన్ గా మారిపోయి… సీఎం క్యాంపు ఆఫీసు డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చడంతో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు ఎక్కడయితే బావుంటుంది అన్న విషయంలో అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. జూబ్లీ హిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి ఇనిస్ట్యూట్ భవనాన్ని సీఎం క్యాంపు ఆఫీసుగా తీర్చిదిద్దితే బావుంటుందని నిర్ణయానికి వచ్చినప్పటికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా మరో భవనాన్ని ఎంపిక చేస్తే బావుంటుందని అధికారులు ఆలోచించారు. ఎంసీఆర్ఐ బిల్డింగ్ అయితే రెసిడెన్షియల్ ఏరియా కావడంతో సీఎం రాకపోకలతో ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసినట్టయితే తరుచూ ట్రాఫిక్ సమస్యల ఎదురవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో నివసించే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కూడా గుర్తించిన అధికారులు ప్రత్యామ్నాయ భవనం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బేగంపేటలోని పైగాహా ప్యాలెస్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసిన అధికారులు వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. ఈ భవనాన్ని సీఎస్ శాంతికుమారితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా పైగాహ ప్యాలెస్ ను పరిశీలించి సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేయడంపై సమాలోచనలు జరిపారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం అయితే ముఖ్యమంత్రి భద్రత విషయంలో కూడా అణువుగా ఉంటుందని సెక్యూరిటీ వింగ్ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ప్యాలెస్ నుండి ముఖ్యమంత్రి సచివాలయానికి ఐదు నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పెద్దగా తలెత్తవన్న అభిప్రాయానికి కూడా వచ్చినట్టుగా తెలిసింది. అంతేకాకుండా పైగాహ ప్యాలెస్ ఏరియాలో సామాన్య ప్రజల నివాసాలు కూడా లేకపోవడం వల్ల సెక్యూరిటీ చర్యలు తీసుకున్నా ఎవరికి అవాంతరాలు ఎదురు కావని, అలాగే ప్రముఖులు కూడా వచ్చిపోయేందుకు అనువుగా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
భవన చరిత్ర ఇదే…
హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (HMDA) పరిధిలో ఉన్న ఈ భవనాన్ని 1896లో నిర్మించారు. నవాబ్ ఇక్బాల్ ఉద్ దౌలా (సర్ వికార్-ఉమ్రా II) హయాంలో నిర్మించారు. ఈ భవనంలో ఆరవ నిజాం మీర్ మొహబూబ్ అలీ ఖాన్ హయాంలో పైగాహ్ కు చెందిన ప్రధానమంత్రి నివాసం ఉండేవారు. హెరిటేజ్ భవనంగా 1998లో గుర్తించిన ఇందులో 1982 నుండి హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయం కొనసాగుతోంది. ఒక వేళ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ భవనం అన్నింటా అనువుగా ఉందని నిర్ణయంచినట్టయితే HMDA కార్యాలయాన్ని మరో భవనంలోకి మార్చనున్నారు. అలాగే సీఎం సెక్యూరిటీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టడంతో పాటు క్యాంప్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.