రంగంలో ముగ్గురు… బరిలో నిలిచేది ఎందరూ..?

దిశ దశ, కరీంనగర్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సారి విద్యావంతుల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పొలిటికల్ పార్టీల నేపథ్యం ఉన్న విద్యావంతులు మాత్రమే మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే ఈ సారి ఇంతకాలం రాజకీయాలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన వారు కూడా పోటీ పడేందుకు ఉత్సుకత చూపిస్తుండడం గమనార్హం. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేసేందుకు ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, అల్ఫోర్స్ ఛైర్మన్ వి నరేందర్ రెడ్డి, ట్రస్మా వ్యవస్థాపకుల్లో ఒకరైన యాదగిరి శేఖర్ రావులు పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ప్రకటించిన అల్ఫోర్స్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నప్పటికీ టికెట్ వచ్చినా… రాకున్న పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుండి మరోసారి టికెట్ ఆశించినప్పటికీ తన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నారు ట్రస్మా చీఫ్ అడ్వయిజర్ యాదగిరి శేఖర్ రావు, ఇప్పటికే ఆయనకు ట్రస్మాతో పాటు ఏపీకి చెందిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన సంఘం కూడా మద్దతు ప్రకటించింది. దీంతో ఆయన ఈ సారి ఖచ్చితంగా పోటీలో ఉంటారన్న సంకేతాలు ఇచ్చేశారు. పార్టీలు ఆదరించినా ఆదరించకపోయిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ట్రస్మా శేఖర్ రావులు పోటీ చేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి.

ముగ్గురూ అయితే…

ఒక వేళ ప్రసన్న హరికృష్ణ కూడా పోటీ చేసినట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అటు ఆయా పార్టీల అండదండలతో పోటీ చేసే అభ్యర్థులు విద్యారంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారి మధ్య పోటీ జరగనుంది. అయితే ప్రసన్న హరికృష్ణ, నరేందర్ రెడ్డి, శేఖర్ రావులు పోటీ చేసినట్టయితే ఓ వైవిద్యత కూడా చోటు చేసుకోనుంది. హైస్కూల్ వరకు విద్యనందించే సంస్థల యూనియన్ ప్రతినిధిగా ట్రస్మా శేఖర్ రావు, విద్యారంగంలో తెలంగాణలో ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నరేందర్ రెడ్డి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు స్టడీ మెటిరియల్ అందించడంతో పాటు, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే ప్రసన్న హరికృష్ణల మధ్య పోటీ సాగనుంది.

చీలిపోయే అవకాశం…

కేవలం గ్రాడ్యూయేట్స్ మాత్రమే ఎన్నుకోవల్సిన నేపథ్యంలో విద్యారంగంలో ఎవరికి వారే తమ ప్రత్యేకతను సంతరించుకున్న ముగ్గురి మధ్య పోటీ అనివార్యమైతే మాత్రం ఓట్లు చీలిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ట్రస్మా ఇప్పటికే యాదగిరి శేఖర్ రావుకు అండగా నిలబడాలని నిర్ణయించడంతో ఆయా పాఠాశాలల్లో పని చేసే పట్టభద్రులంతా కూడా యాదగిరి శేఖర్ రావుకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి కూడా కళాశాలల యాజమాన్యల తరుపున మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నారు. అంతేకాకుండా తాను ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో చదువుకున్న వారు తనకు అండగా నిలుస్తారని కూడా అంచనా వేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాన్వేషనలో ఉన్న యువతను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైన విన్నర్ పబ్లికేషన్స్ అధినేత ప్రసన్న హరికృష్ట కూడా నిరుద్యోగ పట్టభద్రుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యారంగంతో పాటు నిరుద్యోగుల మద్దతు ఒకే అభ్యర్థికి ఉన్నట్టయితే వారి గెలుపు నల్లేరుపై నడకలా సాగుతుందనే చెప్పవచ్చు. కానీ ఆయా రంగంలో పట్టున్న ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంత ఆయా విభాగాల వారిగా ఎవరికి వారు ప్రచారం చేసుకుని తమ పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేయడం వల్ల పట్టభద్రులు తమకు నచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.

You cannot copy content of this page