చిత్రం చూసి విచిత్ర పోకండి…

బ్రాండెడ్ అనుకుంటే అంతే సంగతులు…

మార్కెట్లో మొబైల్ నకిలీ యాక్సెసరీస్

దిశ దశ, కరీంనగర్:

నేటి తరం అంతా కూడా బ్రాండెడ్ చుట్టే తిరుగుతోంది. ఆన్ లైన్ రేటింగ్స్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. సాంకేతికతంగా అభివృద్ది చెందామని భావిస్తున్న వారికి తగ్గట్టుగానే నకిలీ వస్తువులను బ్రాండెడ్ ముద్ర వేసి విక్రయిస్తున్నారు కొంతమంది వ్యాపారులు. బ్రాండెడ్ కంపెనీకి సంబధించిన బొమ్మ కనబడింది అనుకుని కొనుగోలు చేసినట్టయితే రిటేల్ షాపు వాలాలు నిండా ముంచేస్తారన్న విషయం గుర్తు పెట్టుకోండి. బ్రాండెడ్ కంపెనీలకు టోకరా ఇచ్చి అదే బ్రాండ్ వేసి విక్రయాలు చేస్తున్న నకిలీ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నాయి ప్రముఖ కంపెనీలు. తాజాగా గురువారం కరీంనగరంలోని పలు రిటేల్ యాక్సెసరీస్ విక్రయాలు చేస్తున్న రిటేల్ షాపులపై కంపెనీ ప్రతినిధులు దాడులు చేశారు. ఈ మేరకు కొన్ని షాపుల్లో సెల్ ఫోన్లకు సంబంధించిన నకిలీ వస్తువుల అమ్మకాలను గుర్తించి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు. యాపిల్ కంపెనీకి చెందిన విజిలెన్స్ బృందం కరీంనగర్ లోని పలు యాక్సెసరీస్ షాపుల్లో దాడులు నిర్వహించి నకిలీ మెటిరియల్ అమ్మకాలను సేల్స్ చేస్తున్నట్టుగా గుర్తించింది. యాపిల్ కంపెనీ సింబల్ తో డూప్లికేట్ ఎయిర్ బర్డ్స్, పవర్ ఎడాప్టర్స్, లైటింగ్ కేబుల్, బ్యాక్ కవర్లు అమ్ముతున్నారని కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని పంచరతన్ మార్కెటింగ్ షాప్, శ్రీ జి మొబైల్ స్పేర్ పార్ట్స్, మహాలక్ష్మి సెల్ వరల్డ్, చాముండా మొబైల్ షాప్ లపై దాడులు చేసి డూప్లికేట్ వస్తువులను గుర్తించి ఆయా దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. యాపిల్ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాక్ససరీస్ దుకాణాల యాజమానులపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.

వేలల్లో ధర… వందల్లో విక్రయం…

యాపిల్ బ్రాండెడ్ కంపెనీ ట్రేడ్ మార్క్ అనుమతులు తీసుకుని విక్రయాలు జరుపుతూ ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన ట్రేడ్ మార్కు పొందిన చిత్రాలను వినియోగిస్తూ నకిలీ యాక్సెసరీస్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. సాధారణంగా యాపిల్ కంపెనీకి సంబంధించిన ఏదైనీ యాక్సెసరీ కొనుగోలు చేయాలంటే వేలల్లోనే ధర ఉంటుంది. అయితే రిటైల్ దుకాణ దారులు అదే బ్రాండ్ ను ఉపయోగించి నామ మాత్రపు ధరలకు విక్రయిస్తుంటారు. దీంతో వినియోగదారులు తక్కువ ధరకు దొరుకుతున్నాయని యాక్ససరీస్ షాపుల్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇదే అదనుగా భావించిన నకిలీ కంపెనీలు నకిలీ సెల్ ఫోన్ వినియోగ వస్తువులను విక్రయించేందుకు కొకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. దీంతో యాపిల్ కంపెనీ రిటేల్ షాపుల్లో తమ బ్రాండ్ ఉపయోగించుకుంటూ అమ్మకాలు సాగిస్తున్న దుకాణాల్లో విజిలెన్స్ పెట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ లోనూ దాడులు చేసినప్పుడు కొన్ని షాపుల్లో జరుగుతున్న యాక్సెసరీస్ విక్రయాల్లో బ్రాండ్ కాపీ చేసి నకిలీ వస్తువుల అమ్మకాలు సాగిస్తున్నట్టుగా గుర్తించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

ఫోనుకు లక్ష…

రూ. లక్ష వరకు ధర పలికే యాపిల్ కంపెనీ ఫోన్లకు యాక్ససరీస్ కూడా అదే స్థాయిలో ధరలో పలికే అవకాశం ఉంటుందన్న విషయాన్ని వినియోగదారులు విస్మరించారు. దీంతో తక్కువ ధరకు దొరికే ఈ యాక్సెసరీస్ సదరు బ్రాండెడ్ కంపెనీల్లోనే తయారవుతున్నాయి కానీ… ట్యాక్సులను తప్పించుకునేందుకు దొంగదారిని విక్రయిస్తున్నాయన్న భ్రమల్లోవి వెల్లి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వన్ టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ సూచించారు.

You cannot copy content of this page