కరీంనగర్ అధికార పార్టీ నేతల తీరు…
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ధ్వజం
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఉంటే ఏలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకైనా పాల్పడవచ్చు… లేదంటే మాత్రం జైలు పాలు కావల్సిందే అన్నట్టుగా సాగుతోందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆరోపించారు. గురువారం విడువల చేసిన ఒక ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహారశైలిని ఏకి పడేశారు. ప్రధానంగా కరీంనగర్ లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉందని, గులాభి జెండా మోసేటోళ్లకు ఓ న్యాయం, దూరంగా ఉన్న వారికి మరో న్యాయం అన్నట్టుగా తయారైందని విమర్శించారు. దాదాపు ఏడాది క్రితం కరీంనగర్ లో రేషన్ బియ్యం అక్రమ దందా చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అప్పటి పోలీసు కమిషనర్ వి సత్యనారాయణ మీడియా ముందు ప్రకటించారన్నారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారని కూడా సీపీ వెల్లడించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్, గంగిరెడ్డి, రామృష్ణతో పాటు పలువురిపై పీడీ యాక్టు పెడ్తామని కూడా సీపీ సత్యనారాయణ ప్రకటించారని అంబటి జోజిరెడ్డి తెలిపారు. నిరుపేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్న విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించడంతో కరీంనగర్ ప్రజలంతా కూడా సంబరిపడిపోయారన్నారు. సివిల్ సప్లై మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ కూడా తీవ్రంగా పరిగణించాలని ప్రకటించడంతో విపక్ష పార్టీ నేతగా నేను కూడా సంతోషం వ్యక్తం చేసి ఆహ్వానించదగ్గ పరిణామమని అనుకున్నాను. కానీ ఈ అంశంపై సీపీ ప్రకటన మాత్రం కార్యరూపం దాల్చలేదని గుర్తు చేయకపోవడానికి కారణ: ఏంటని అడిగారు. రేషన్ బియ్యం దందాలో భాగస్వాములు అయిన వారంతా కూడా మంత్రి గంగుల కమలాకర్ అనుచరులు, దగ్గరి వారు కావడంతోనే వారిపై పీడీ యాక్టు పెట్టలేదని అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. ఒకవేళ చట్టం తనపని తాను చేసుకుంటూ పోతే వేణుగోపాల్, గంగిరెడ్డిలతో పాటు ఇతర రేషన్ బియ్యం దందా గాళ్లపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలేంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ విషయంలో మాత్రం అధికార పార్టీ కక్ష్య కట్టినట్టుగా వ్యవహరిస్తోందని స్పష్టం అవుతోందని జోజిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీకి బొమ్మకల్ శ్రీనివాస్ రాజీనామా చేయగా ఇప్పుడు ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ అయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణాలు ఏంటో చెప్పాల్సిన బాధ్యత మంత్రి గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులపై ఉందన్నారు. గత మార్చినెలలో రౌడీ షీట్ కు సంబంధించిన లేఖ సర్క్యూలేట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోంది..? అలాగే శ్రీనివాస్ కేసుల పూర్వా పరాలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైళ్లు కూడా ఎందుకు చక్కర్లు కొడుతున్నాయో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని జోజిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇంతకాలం శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు తమకేమీ తెలియనట్టుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆయన నేర చరిత్రను కావాలనే ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మీ పార్టీలో కొనసాగినంత సేపు ఓ విధానం, మీ పార్టీని వీడినప్పుడు మరో విధానం అవలంభించడం సరైందా కాదా అన్న విషయంపై బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మీ పార్టీలో ఉన్నంత కాలం నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తి సచ్ఛీలుడుగా ఉంటే పార్టీని వీడిన వెంటనే క్రిమినల్ గా మారిపోయే పద్దతి వెనక దాగి ఉన్న కుట్రలు ఏంటో కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని అంబటి జోజిరెడ్డి అన్నారు. ఒకవేళ చట్టం అంశం మాకేం సంబంధం లేదు అన్నట్టయితే ఏడాది క్రితం అప్పటి సీపీ సత్యనారాయణ మీడియా ముందు ప్రకటించిన రేషన్ బియ్యం దందాలో పాలు పంచుకుంటున్న వేణుగోపాల్, గంగిరెడ్డిలతో పాటు మిగతా వారిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదో కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. వారిపై సీపీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటోనన్నది కరీంనగర్ ప్రజలు కూడా గమనించాలని అభ్యర్థించారు.