దిశ దశ, కరీంనగర్:
స్మార్ట్ సిటీ కరీంనగర్ లో జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటు విషయంలో సరైన చర్యలు తీసుకోలేకపోయారా..? లేక ఆ మహనీయుల వర్థంతి, జయంతి సమయాల్లో వారిని పూజించే సంస్కృతి ఉందన్న విషయాన్ని విస్మరించారో తెలియదు కానీ వారికి నివాళులు అర్పించే వారు మాత్రం సర్వ కష్టాలు పడుతున్నారు. గురువారం మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రాం వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆయన విగ్రహం వద్దకు వెల్లేందుకు పైకి ఎగ బాకుతూ వెల్లాల్సి రావడంతో చాలా మంది ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా మెట్లు లేకపోవడం, తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి నివాళులు అర్పించే పరిస్థితి లేకుండా పోయింది. బల్దియా అధికారులు కనీసం జగ్జీవన్ రాం వర్థంతి సందర్భంగా అయినా టెంపరరీ స్టెప్స్ ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐలాండ్ ను నిర్మించే సమయంలో ఇంజనీర్లు తయారు చేసిన అంచనాల్లో భవిష్యత్ గురించి వారి జయంతి, వర్థంతుల గురించి విస్మరించారా లేక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయోచ్చని భావించారో తెలియదు కానీ బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఎదురైన అనుభవం వారిని తీవ్రంగా బాధించింది. మహనీయున్మి స్మరించాలన తపన పడ్డ వారంతా ఆయన విగ్రహానికి పూల దండ వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాబు జగ్జీవన్ రాం జయంతి వల్ల ఎదురైన అనుభవంతో అయినా బల్దియా అధికారులు నగరంలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాల వద్ద జయంతి, వర్థంతి జరుపుకునేందుకు అనుకూలమైన ఏర్పాట్లు చేస్తారో లేదో చూడాలి. ఐలాండ్స్ లుక్కింగ్ దెబ్బ తింటుందని భావించి మెట్ల నిర్మాణం లేకుండా డిజైన్ చేశారా లేక వీరి జయంతి, వర్థంతులప్పుడు నేటి తరానికి చెందిన వారు నివాళులు అర్పిస్తారన్న విషయాన్ని పట్టించుకోలేదా అన్నదే అంతు చిక్కడం లేదు. ఏది ఏమైనా మహనీయుల విగ్రహాల వద్ద నివాళులు అర్పించే అవకాశం లేకుండా నిర్మాణాలు ఐలాండ్స్ నిర్మాణం జరపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వ్యవహరించిన తీరు వల్ల మహనీయులను స్మరించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఏఐవైఎఫ్ నేత యుంగధర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి నివాళులు అర్పించే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు.