అబార్షన్ చేశారంటున్న అత్తమామ

అనారోగ్యానికి గురయ్యానంటున్న కోడలు

క్లీనిక్ నిర్వహాకురాలితో పాటు పలువురిపై దాడి

పోలీసుల ఎంట్రీ

దిశ దశ, కరీంనగర్:

ఏడు నెలల గర్భంతో ఉన్న తన కోడలు అబార్షన్ చేయించుకుందని, క్లీనిక్ నిర్వహకురాలే ఈ దారుణానికి ఒడిగట్టిందంటూ అత్తామామలు దాడికి పాల్పడిన ఘటన కరీంగనర్ లో చోటు చేసుకుంది. మంగళవారం స్థానిక జ్యోతినగర్ లోని ఓ క్లీనిక్ లో గొడవ జరుగుతుండడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన ఓ వివాహితను జ్యోతినగర్ లోని ఓ క్లీనిక్ లో రెడ్ హైండడ్ గా పట్టుకున్న అత్తామామలు దాడికి పాల్పడ్డారు. తన కోడలు గర్భం తీయించుకుందని క్లీనిక్ లోకి చొరబడి మరీ దాడి చేశారు. నిర్వహాకురాలితో పాటు కోడలి తల్లిపై కూడా ఆగ్రహంతో ఊగిపోయిన వారు దాడికి పూనుకున్నారు. అయితే తనకు రక్త స్రావం అవుతుంటే చికిత్స చేయించుకునేందుకు వచ్చాను తప్ప అబార్షన్ చేయించుకోలేదని కోడలు చెప్తున్నారు. ఈ గొడవ సమాచారం అందుకున్న పోలీసులు జ్యోతీనగర్ లోని క్లినిక్ వెల్లి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ విభాగానికి చెందిన డాక్టర్లు కూడా ఈ విషయంపై విచారణ చేపట్టారు.

క్లీనిక్ ముసుగులో..?

జ్యోతినగర్ లోని క్లీనిక్ ముసుగులో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ క్లీనిక్ నిర్వహాకురాలిపై కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. తాజాగా అబార్షన్ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో మరోసారి పోలీసులు ఈ క్లీనిక్ పై ఆరా తీస్తున్నారు. తల్లి గర్భంలో పెరుగుతున్న పిండం ప్రాణాలతో బయటకు రాకముందే అంతమొందించే సాహసానికి ఒడిగట్టడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలా క్లీనిక్ కు అనుమతి ఉందా.. నిర్వహాకురాలు ఏ రకమైన వైద్యం చేసేందుకు అర్హురాలు, సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసేందుకు అవసరమైన క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశారా అన్న వివరాలను తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ధర్మారం మండలానికి చెందిన అత్తామామలు ఆరోపణలను బట్టి అక్కడ అబార్షన్లు జరుగుతున్నాయని తేటతెల్లం అవుతోంది. ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు నగరంలో ప్రముఖ గైనకాలిజిస్టులు ఉన్నప్పటికీ ధర్మారం మండలం నుండి ప్రత్యేకంగా పేషెంట్ జ్యోతినగర్ లోపల ఉన్న సాధారణ క్లీనిక్ కు ఎలా వెల్లిందన్నదే అంతుచిక్కకుండా పోతోంది. సాధారణంగా ఆమె అక్కడే చికిత్స చేయించుకుంటున్నట్టయితే ఈ విషయం అత్తామామల వద్ద ఎందుకు దాచినట్టో కూడా అర్థం కావడం లేదు. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన కోడలు ఆ చూకిని జ్యోతినగర్ లోని సదరు క్లీనిక్ లో మంగళవారం దొరకబట్టామని వారు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్య సమస్య ఉన్నట్టయితే అత్తామామలకు చెప్పకుండా రహస్యంగా చికిత్స చేయించుకుంటోందన్నదే అంతుచిక్కకుండా పోయింది. అలాగే సదరు క్లీనిక్ పై గతంలో కేసు నమోదయినందున అత్తామామలు చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపడుతారోనన్న చర్చ సాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇలాంటి క్లీనికి విషయంలో కఠినంగా వ్యవహరించనట్టయితే నిభందనలకు విరుద్దమైన చర్యలను ప్రోత్సహించినట్టవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్లీనిక్ అంటే ప్రాథమిక వైద్య సేవలందించేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది కానీ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేయకూడదని అంటున్నారు. సదరు క్లీనిక్ నిర్వాకురాలు ఎలాంటి క్వాలిఫికేషన్ తో నడుపుతున్నారు, ఆ సర్టిఫికెట్ల గురించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉంది. అలాగే నిర్వహాకురాలు ప్రిస్కిప్షన్ లో ఏ మెడిసిన్స్ రాస్తున్నారు..? క్లీనిక్ లో ఉన్న ఎక్విప్ మెంట్స్ ఏమిటీ తదితర అన్ని వివరాలను సేకరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ఘటనపై అన్ని కోణాలో ఆరా తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

You cannot copy content of this page