అడ్డుకోని అధికారులు
దిశ దశ, జగిత్యాల:
కొండగట్టు అంజన్న సన్నిధిలో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. టెండర్ పాటలో దక్కించుకున్న వ్యాపారాలు చేయకుండా అడ్డదారిలో అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. నిషేధిత గుట్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఆధ్మాత్మికత ఉట్టిపడే విధంగా ఉండాల్సిన కొండగట్టు ఆలయ ప్రాంతంలో గుట్కాల అమ్మకాలు జరగడంపై హిందూవాహినీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గుట్కా దందాలు చేస్తున్న దుకాణాల్లో హిందూవాహిని కార్యకర్తలు సోదాలు చేసి అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేశారు. గుట్కా అమ్మకాలకు సంబంధించిన ఆధారాలను ఏఈఓ బుద్ది శ్రీనివాస్ కు అందించిన హిందూ వాహిని కార్యకర్తలు దుకాణం టెండర్ రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుట్క అమ్మకాలు చేస్తున్న షాపును మూయించి, ఈ దుకాణాన్ని తెరవకుండా చూడాలన్నారు. లేనట్టయితే ఈ ఆధారాలన్ని కూడా ఉన్నతాధికారులకు పంపి కొండగట్టు ఆలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని హిందూవాహిని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో హిందూవాహిని కొడిమ్యాల మండల అధ్యక్షుడు కోల అనిల్, బీజేపీ మల్యాల మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రావణ్ రెడ్డి, హిందూ వాహిని కార్యకర్తలు కార్తీక్, వేణు, పవన్, సురేందర్, సాయి కృష్ణ, భరత్, శ్రీనివాస్, వాసు, నిఖిల్, మహేందర్, దినేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.