ఐలాపూర్ లో అమెరికా పిస్తోల్

పట్టుకున్న జగిత్యాల జిల్లా పోలీసులు

దిశ దశ, జగిత్యాల:

అమెరికాలో తయారైన పిస్తోల్ జగిత్యాల జిల్లాలో హల్ చల్ చేసింది. అక్రమ వసూళ్లకు పాల్పడేందుకు స్కెచ్ వేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడో నిందితుడు. ఈ సమాచారం అందుకున్న మెట్ పల్లి సబ్ డివిజన్ పోలీసులు రంగంలోకి దిగి గుట్టు రట్టు చేశారు. గురువారం జగిత్యాల ఎస్పీ భాస్కర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

పండ్ల వ్యాపారంలో నష్టంతో…

జిల్లాలోని కోరుట్ల మండలం ఐలాపూర్ కు చెందిన సుందరగిరి లక్ష్మీ నర్సయ్య(39) అనే వ్యక్తి కొంతకాలంగా పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వ్యాపారంలో రూ. 50 లక్షల నష్టం వాటిల్లడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. రాజుభాయ్ అలియాస్ గంగారం ద్వారా ముంబాయికి చెందిన రమేష్ పాటిల్ బిట్టు అలియాస్ బంటీల ద్వారా రూ. లక్ష వెచ్చించి వెపన్ కొనుగోలు చేశాడు. ఈ ఆయుధంతో బెదిరింపులకు పాల్పడుతూ స్థానికుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని స్కెచ్ వేసుకున్నాడు. ఏడు నెలల క్రితం లక్ష్మీ నర్సయ్య ఈ వెపన్ ను కొనుగోలు చేసుకుని ఐలాపూర్ కు తీసుకరాగా బుధవారం అక్రమ వసూళ్లకు పడేందుకు సమాయత్తం అవుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు కోరుట్ల, ఐలాపూర్ రహదారిలో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి అమెరికా మేడ్ పిస్తోల్, 2 మ్యాగ్జిన్లు, కెఎఫ్ 7.65 రౌండ్లు 3, ఒక సెల్ ఫోన్, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కోరుట్ల మండలం ఐలాపూర్ కు చెందిన రాజు భాయి అలియాస్ గంగారం, ముంబాయిలో నివాసం ఉంటున్న ఆర్మూర్ వాసి నారాయణ, ముంబాయికి చెందిన రమేష్ భాయి, పాటిల్, బిట్టు అలియాస్ బంటిలు పరారీలో ఉన్నట్టు ఎస్పీ భాస్కర్ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలక భూమిక పోషించిన మెట్ పల్లి డీఎస్పీ రవిందర్ రెడ్డి, కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది సత్తయ్య, సంతోష్, కేశవ్, సాగర్, శ్రీనులను ఎస్పీ అభినందించారు.

You cannot copy content of this page