దిశ దశ, రామగుండం:
సోమవారం విధుల్లో చేరారు… మంగళవారం అర్థరాత్రి కార్యరంగంలోకి దిగారు ఆ పోలీసు అధికారి. కార్మిక క్షేత్రంలో శాంతి భద్రతల తీరును పరిశీలించిన ఆయన క్షేత్ర స్థాయి అధికారులను పరోక్షంగా అప్రమత్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసించే రామగుండం కమిషనరేట్ పరిధిలో వైవిద్యమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. కార్మికుల నుండి ఉన్నతాధికారుల వరకు కూడా దేశంలోని పలు రాష్ట్రాల వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తుంటారు. రామగుండం పోలీసు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టని అంబర్ కిషోర్ ఝా హెడ్ క్వార్టర్స్ ఏరియాలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. మంగళవారం అర్థరాత్రి గోదావరిఖని, రామగుండం, ఎన్టీపీసీలలో పర్యటించి అర్థరాత్రి వేళల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో పరిశీలించారు. రామగుండం రైల్వే స్టేషన్, గోదావరిఖని బస్ స్టేషన్ లలో ఉన్న ప్రయాణీకులతో మాట్లాడిన సీపీ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు సీపీ వచ్చి రాగానే ఆకస్మిక తనఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉండడంతో రామగుండం పరిధిలో సీపీ తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.