ఘనంగా నిర్వహించాలని పిలుపు…
అప్రమత్తమైన సరిహద్దు బలగాలు
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాలు జులై 28 నుండి ఆగస్టు 3 వరకు కొనసాగనున్నాయి. దేశ వ్యాప్తంగా అమర వీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో బలగాలు అప్రమత్తం అయ్యాయి.
వారోత్సవాలు…
1972 జులై 28న భారతదేశంలో విప్లవ బీజాలు వేసిన చారమజుందార్, 1982 జులై 18న కన్హాయ్ ఛటర్జీ మరణించారు. విప్లవ పోరాటానికి శ్రీకారం చుట్టిన ఈ అగ్రనేతలు ఇద్దరి స్మారకార్థం నక్సల్స్ ఏటా అమర వీరుల వారోత్సవాలను నిర్వహిస్తుంటారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒడిషా రాష్ట్రాల్లో పట్టు ఉన్న మావోయిస్టులు కూడా విప్లవ పోరాట అగ్రజులను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అడవుల్లో అమర వీరుల పేరిట స్థూపాలను ఏర్పాటు చేయడం, విప్లవ పోరాటంలో ఆ ఏడాది మరణించిన వారిని స్మరించుకుంటూ భారీ ఎత్తు సభలు, ర్యాలీలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పట్టున్న ప్రాంతాల్లో మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో జనసమీకరణ చేసి అమరవీరుల బలిదానాలపై సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తారు. ఈ సారి కూడా ఇదే విధానంతో అమర వీరుల వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఏడాది 200 మందికి పైగా విప్లవ పోరాటంలో మరణించారని మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. గత సెప్టెంబర్ 30 ఎంఎంఎస్సీ ఇంఛార్జీ దాముదాదా నది దాటుతుండగా ఆ ప్రవహాంలో కొట్టుకపోయి మరణించగా, కస్తూరిపాడు గ్రామానికి చెందిన పాలి అనారోగ్యంతో మృత్యువాత పడిందని మావోయిస్టు పార్టీ వివరించింది. అయితే ఎక్కువ శాతం కూడా మావోయిస్టు పార్టీ బలగాలతో చేతిలో చిక్కి మరణించారు.
వర్షాలు… వరదలు…
మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించనున్న క్రమంలో వాతావరణం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలతో వరదలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సంస్మరణ సభలు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతోంది. గత సంవత్సరం కూడా 10 వేల మందికి పైగా జనసమీకరణ చేసిన మావోయిస్టులు సరిహద్దు అడవుల్లో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సారి కూడా ఇదే స్థాయిలో సమావేశం నిర్వహించే అవకాశం ఉండడంతో పాటు అటవీ ప్రాంతాల్లో తాత్కాలిక స్థూపాలను ఏర్పాటు చేసి అమరవీరుల స్మారక సభలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతికూల వాతావరణంలో మావోయిస్టులు ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహించబోతున్నారో అన్నది మాత్రం తెలియరావడం లేదు. వారోత్సవాల తరువాత ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసే ప్రకటనలతోనే తెలిసే అవకాశం ఉంటుంది.
బలగాల అలెర్ట్…
ఇకపోతే మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల బలగాలు కూడా అప్రమత్తం అయ్యాయి. మహారాష్ట్రలో సి 60, చత్తీస్ గడ్ లో బస్తర్ ఫైటర్స్, కోబ్రా, డీఆర్జీ, తెలంగాణా, ఏపీలలో గ్రే హౌండ్స్ బలగాలతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పావులు కదుపనున్నాయి. అటవీ ప్రాంతాల్లో సంస్మరణ సభలను నిలువరించడంతో పాటు నక్సల్స్ ఏరివేత కోసం భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టనున్నాయి. బస్తర్ ఉమ్మడి జిల్లాల్లో బలగాల మధ్య సమన్వయం చేసుకుంటూ సెర్చింగ్ ఆపరేషన్ చేయనుండగా, సరిహధ్దు రాష్ట్రాల్లో కూంబింగ్ చేపట్టనున్న ఫోర్స్ కూడా ఎప్పకప్పుడు కోఆర్డినేట్ అవుతూ కూంబింగ్ నిర్వహించనున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. వరదల సమయం కావడంతో సహాయక చర్యల్లో పాల్గొనే వారు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతీకారం కోసం మావోయిస్టులు దాడులు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసు అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం.