త్వరలో అమలు…
దిశ దశ, హైదరాబాద్:
పెద్ద దవాఖానలో కొత్త విధానం అమలు చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్య తరగతి వర్గాలకు పెద్ద దిక్కుగా ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో ఆధునిక సేవలు అందించే దిశగా ముందుకు సాగాలని నిశ్చయించారు. పేషెంట్లు, అటెండెంట్లు టెస్టుల కోసం ప్రదక్షిణలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని గమనించి మొబైల్ ఆధారంగా సమాచారం అందించేందుకు సమాయత్తం అవుతున్నారు. నిమ్స్ లో ఎక్స్ రే, సిటి స్కార్, ఎంఆర్ఐతో పాటు ఇతరాత్ర టెస్ట్ రిపోర్టుల కోసం పేషెంట్లు ఆయా విభాగాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. దీంతో పేషెంట్లు తమ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు టెస్టులకు సంబంధించిన ఫిల్మ్ లు, రిపోర్టులు ఇకనుండి ఫోన్ ద్వారా పంపించాలని నిర్ణయించారు. నూతనంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రూ. నుండి 8 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉందని నిమ్స్ డైరక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. దీనివల్ల పేషెంట్లు రిపోర్టుల కోసం నిమ్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోతోందని అంటున్నారు.