షరియా చట్టమే అమలు..

తాలిబాన్లు హస్తగతం చేసుకున్న అఫ్ఘానిస్తాన్ దేశంలో షరియా చట్టాలు మాత్రమే అమలవుతున్నాయని మరో సారి వెల్లడైంది. తాలిబన్లు అఫ్ఘాన్ ను కైవసం చేసుకున్న తరువాత వారే పరిపాలన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ మహిళల స్వేచ్ఛ అనేది లేకుండా పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. స్త్రీలను కట్టడి చేసే విధంగానే షరియా చట్టాలను అమలు చేస్తున్నారని మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆంక్షల నడుమ బాలికలు, మహిళల జీవితాలు కొనసాగే పరిస్థితిని తాలిబన్లు తీసుకొచ్చారు. కేసుల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగ శిక్షలు విధించిన ఘటన కలకలం సష్టిస్తోంది. వివిధ నేరాలకు పాల్పడ్డారన్న కారణంతో 19 మందికి కొరడా దెబ్బలతో శిక్ష విధించారని, ఇందులో మహిళలు కూడా ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. షరియా చట్టాల మేరకు బహిరంగ శిక్షలు విధించినట్టుగా అప్ఘానిస్తాన్ అధికారి ఒకరు వెల్లడించినట్టుగా ప్రచారం జరుగుతోంది. షరియాకు లోబడే ఈ శిక్ష అమలు చేసినట్లు తాలిబన్లు సమర్థించుకున్నారని చెప్తున్నారు. అఫ్ఘానిస్తాన్ లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న తఖార్‌ ప్రావిన్సు ఏరియా తలూఖన్‌ నగరంలో మొత్తం 19 మందికి కొరడా దెబ్బలతో శిక్ష విధించారని, వీరిలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారని ఆ దేశ అధికారి అబ్దుల్‌ రహీం రషీద్‌ వెల్లడించడం గమనార్హం. నవంబర్‌ 11న విధించిన ఈ శిక్ష మత పెద్దలు, విద్యావంతులు, స్థానికుల సమక్షంలోనే అమలు చేశామని తెలిపారు. 2021 ఆగస్టులో అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత షరియా చట్టాలను అమలు చేస్తూ కొరడా దెబ్బలతో శిక్ష అమలు చేసినట్టుగా అధికారికంగా వెల్లడించడం ఇదే ప్రథమం. 1990వ దశాబ్దంలో అఫ్గాన్‌ పౌరులపై తమ ప్రతాపాన్ని చూపిన తాలిబన్లు న్యాయస్థానంలో శిక్ష పడిన వారిని బహిరంగంగా ఉరితీయడం, కొరడా దెబ్బలతో శిక్షించడం, రాళ్లతో కొట్టడం వంటి శిక్షలు అమలు చేసేవారు. దీంతో అక్కడ అమలవుతున్న శిక్షల విధానంపై అంతర్జాతీయ సమాజం కూడా ఆందోళనలు వ్యక్తం చేసిన సందర్భాలూ లేకపోలేదు. అఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులను కట్టడి చేసేందుకు పెద్దన్న అమెరికా తన బలగాలను పంపించి రక్షణ చర్యలు తీసుకుంది. గత సంవత్సరం బలగాలను అమెరికా ఉపసంహరించురించుకోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనతో మళ్లీ షరియా చట్టాలను అమలు చేసే దిశగా తాలిబన్లు వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోంది. తాలిబన్లను కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ శిక్షలు మరింత కఠినంగా మారే పరిస్థితి కూడా ఉంటుందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page