సీలింగ్ భూములని ఆరోపణలు…
దిశ దశ, కరీంనగర్:
పీజీ మెడికల్ సీట్ల వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ED) విచారణ ఎదుర్కొంటున్న ఆ కాలేజీపై మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై ఫిర్యాదుల పరంపర నడుస్తున్న క్రమంలో కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ మొదలైంది.
సీలింగ్ భూముల్లో…
కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ రెవెన్యూ శివార్లలో ఏర్పాటు చేసిన చల్మెడ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CAIMS) కాలేజీ, హస్పిటల్ భవనాలు సీలింగ్ యాక్టు పరిధిలో ఉన్న భూముల్లో నిర్మించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల ల్యాండ్ రీఫామ్స్ ట్రిబ్యూనల్ లో సీలింగ్ యాక్ట్ 1973లో CC NO: 1052/J/75 కేసు ఉందని, బొమ్మకల్ శివార్లలోని 113, 114, 115 సర్వేనెంబర్లలోని భూమిని పూర్తి స్థాయిలో సీలింగ్ విభాగం స్వాధీనం చేసుకోలేదన్న వాదనలు వెలుగులోకి వచ్చాయి. సీలింగ్ యాక్టు పరిధిలో ఉన్న ఈ భూమి గురించి విచారణ దశలో కేసు ఉన్న సమయంలోనే చల్మెడ ఆనందరావు హస్పిటల్ నిర్వాహకులు హరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చట్ట విరుద్దమని అంటున్నారు. సీలింగ్ పరిధిలో ఉన్న భూములను విక్రయించే హక్కు పట్టాదారులు వారి వారసులకు లేదని, ఈ భూమిని కొనుగోలు చేయడం కూడా చట్ట వ్యతిరేకమేనని అంటున్నారు.
రెవెన్యూ నిర్లక్ష్యమా..?
మరో వైపున చల్మెడ హస్పిటల్ నిర్వాహాకులు సీలింగ్ యాక్టు అమల్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి నాన్ అగ్రికల్చర్ భూమిగా మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగానే రెవెన్యూ అధికారులు నాలా అనుమతులు ఇచ్చేశారని తెలుస్తోంది. ధరణీ రికార్డుల్లో కూడా పట్టాదారుల పేర్లను మార్చినట్టగా స్పష్టం అవుతోంది. కమర్షియల్ అవసరాల కోసం మారుస్తున్న ఈ భూమి విషయంలో రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండానే అప్పటి అధికారులు చకాచకా నాలా అనుమతులు ఇవ్వడం విచిత్రం. హరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ సర్వే నెంబర్ 113లో 8 ఎకరాల 48 సెంట్లు, 114లో 9 ఎకరాల 35 సెంట్లు, 115లో 15 ఎకరాల 98 సెంట్ల మేర భూమి ఉందని, ఈ కేసు జగిత్యాల ఆర్ఢీఓ పరిధిలో ఉన్న సీలింగ్ ల్యాండ్ రిఫామ్స్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతోందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేసిన ఫిర్యాదులో వివరించారు. జగిత్యాల సీలింగ్ ట్రిబ్యూనల్ ఆధేశాల మేరకు 2006 ఆగస్టు 30న 113, 115 సర్వే నెంబర్లలోని 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పంచనామ చేశారాన్నారు. అయితే ఈ భూముల్లో పత్తి, మొక్క జొన్న పంటలు ఉన్నాయని గుర్తించినప్పటికీ… దిగుబడి వచ్చిన తరువాత విక్రయించగా వచ్చిన డబ్బులను ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని కూడా ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది. సర్వే నంబర్ 114లోని 8ఎకరాల 90 సెంట్లు, 115లోని 6 ఎకరాల 60 సెంట్లలలో మెడికల్ కాలేజీ భవనాలు ఉన్నాయని గుర్తించిన అధికారులు వాటిని వదిలేశారన్నారు. పంటలను స్వాధీనం చేసుకోవాలని జగిత్యాల ట్రిబ్యూనల్ ఆదేశాలు ఇచ్చిన తరువాత సీలింగ్ కేసు పరిధిలో ఉన్న మొత్తం భూమిని స్వాధీనం చేసుకోకుండా మెడికల్ కాలేజీ భవనాలు ఉన్నాయని మినహాయింపు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో తేల్చాలని బండారి శేఖర్ సీఏంకు రాసిన ఫిర్యాదులో కోరారు. జి.వి. సదాశివరావు అనే భూస్వామికి చెందిన భూమి అని తేలినప్పడు మెడికల్ కాలేజీ నిర్మాణం జరిపినప్పటికీ ఆ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకోవల్సి ఉందని అన్నారు. అయితే అధికారులు మాత్రం మెడికల్ కాలేజీ పట్ల సానుకూల దృక్ఫథాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. 114, 115 సర్వే నెంబర్లలో చేపట్టిన నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆయన వివరించారు. వీర సదాశివ రావు, సాంబశివరావుల పేరిట ఉన్న భూములపై సీలింగ్ యాక్ట్ ప్రకారం కేసు విచారణ జరుగుతున్నదని, ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదన్న ఆదేశాలు ఉన్నప్పటికీ హరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీతో పాటు ఇతరుల పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేశారని బండారి శేఖర్ ఆరోపించారు.
2…2
బొమ్మకల్ సీలింగ్ భూములకు సంబంధించిన విషయంలో ఇప్పటికే బండారి శేఖర్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. గత ఫిబ్రవరి 12న శేఖర్ ప్రజావాణిలో హరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీతో పాటు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిన సీలింగ్ భూములకు సంబంధించిన వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ మేరకు కరీంనగర్ ఆర్డీఓ ఫిబ్రవరి 15న ఈ భూముల గురించి క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా పర్యవేక్షణ జరిపి రెండు రోజల్లో నివేదిక ఇవ్వాలని కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ను ఆదేశించారు. అయితే ఆర్డీఓ ఆదేశాల మేరకు నేటికీ ఈ భూములపై విచారణ జరుగుతూ…నే ఉందని శేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నెలలు కావస్తున్నా సీలింగ్ భూముల వ్యవహారాన్ని మాత్రం తేల్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సీలింగ్ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.