దిశ దశ, హైదరాబాద్:
మేడ్చల్ డిపో ఘటన మరవకముందే మియాపూర్ డిపో అధికారులు కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తోంది. టీఏవైఎల్ తక్కువ టికెట్ల అమ్మిన వారు అంటూ 15 మంది కండక్టర్లకు చెందిన ఫోటోలను ప్రదర్శించారు. మే 223 నెలలో అతి తక్కువ అమ్మారంటూ అందులో ప్రింట్ చేయించడం గమనార్హం. రెండు రోజుల క్రితం మేడ్చల్ డిపోలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపైనే కార్మికులు గుర్రుగా ఉండగా తాజాగా మియాపూర్ డిపో అధికారులు కూడా అదే బాటలో నడుస్తుండడంతో వారు మనోవేదనకు గురవుతున్నారు.
బాధ్యతల బరువుతో…
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టిన అధికారులు కార్మికులపై కూడా భారం పెట్టారు. బస్సు రోజుకు తిరిగిన దాన్ని బట్టి ఆక్యూపెన్సీ రెష్యూ (ఓఆర్)ను పరిగణనలోకి తీసుకుంటారు. దీని కోసం కార్మికులు బస్ స్టేషన్లలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవల్సి ఉంటుంది. ఓఆర్ ఎంత ఎక్కువ పెరిగితే అంత గుర్తింపు వస్తుంది. డ్రైవర్ల విషయానికి వస్తే కిలోమీటర్ పర్ లీటర్ (కెఎంపీఎల్)ను పరిశీలించి తక్కువ ఇంధనం వినియోగించి ఎక్కువ దూరం ప్రయాణం చేసేందుకు ప్రాధాన్యత కల్పించాలి. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వాహనాన్ని నడపడం, సమయపాలన పాటించడానికి కూడా ప్రాధాన్యత కల్సిస్తారు. తాజాగా ఆర్టీసీ కార్గో సేవలను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్డో పార్శిళ్లను కూడా గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది. వాహనం డ్యామేజ్ కాకుండా క్షేమంగా నడిపే బాధ్యత కూడా డ్రైవర్ల పైనే ఉంటుంది. మహానగరంలో పద్మవ్యూహాన్ని మరిపించే ట్రాఫిక్ ను తప్పించుకుంటూ ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చాల్సి ఉంటుంది. సిటీలో పనిచేసే కండక్టర్ల విధిగా టీఏవైఎల్ టికెట్లు అమ్మాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రయాణీకులకు వాటిని అమ్మేందుకు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే సీటీ బస్సుల్లో సాధారణ ప్రయాణీకులకు టికెట్లు విక్రయించి, పాసులు ఉన్న వారిని క్షుణ్ణంగా పరిశీలించి, టీఏవైఎల్ టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ఆర్టీనరి అయితే ఐదు నిమిషాల్లోగా, ఎక్స్ ప్రెస్ అయితే 10 నిమిషాల లోగా మరో స్టేజీకి సిటీ బస్సులు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఎస్ ఆర్ కూడా మెయింటెన్ చేసి టికెట్ల అమ్మకాల వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్యాలను నిర్దేశించడం, ఛేదించలేకపోయారని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటో అధికారులకే తెలియాలి అన్న వేదన ఆర్టీసీ కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అధికారులు బాధ్యులు కారా..?
అయితే డిపోల వారిగా సంస్థ నష్టాల్లో ఉన్నట్టయితే ఇందుకు బాద్యులుగా కార్మికులను మాత్రమే చేస్తున్నారని, అధికారులు కూడా ఈ వ్యవహారంలో పాత్ర ధారులు ఎందుకు కాకూడదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. క్యాడర్ ను ముందుకు నడిపించే నాయకులు కూడా సమర్థవంతమైన సేవలు అందించడంతో పాటు వారిలో నూతనోత్సాహాన్ని నింపి బలోపేతం అయ్యేందుకు ఎలా కృషి చేయాల్సి ఉంటుందో ఆర్టీసీ డిపోల విషయంలో కూడా అధికారుల పనితీరును ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడం లేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. విధి నిర్వహణలో విఫలం అయిన అధికారుల ఫోటోలను బస్ బవన్ లో ఇలాగే ఫ్లెక్సీల్లో ముద్రించి ఏర్పాటు చేస్తారా అని కార్మిక సంఘ నాయకులు అడుగుతున్నారు. వినూత్న ఆలోచనలతో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆర్టీసీని గట్టెక్కించే ఆలోచనలు చేస్తున్న అధికారులు టీఏవైఎల్ టికెట్ల విక్రయాల విషయంలో అయినా ఇతరాత్ర అంశాలపై అయినా ప్రత్యేకంగా చర్చలు జరిపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.