బస్తర్ లో భారీ కార్యక్రమాలు…
దండకారణ్య అటవీ ప్రాంతంలో వేళ్లూనుకున్న మావోయిస్టుల ఎత్తులకు పోలీసులు పై ఎత్తు వేస్తున్నారా..? వారి బాటలోనే నడిచి అక్కడి ఆదివాసీలకు చేరుక అయ్యే ప్రయత్నం చేస్తున్నారా..? సాయుధ పోరుతోనే సరిపెట్టకుండా మానసిక పరివర్తన కోసం కొత్త వ్యూహాలకు పదును పెట్టారా అంటే అవుననే అనిపిస్తున్నాయి చత్తీస్ గడ్ పోలీసుల చర్యలు. సరికొత్త పంథాలో ముందుకు సాగుతూ అభూజామడ్ అటవీ ప్రాంతంలో పట్టు నిలుపుకునేందుకు మరో వ్యూహానికి పదును పెట్టినట్టుగా స్పష్టం అవుతోంది.
భూంకాల్ పోరాటం…
చత్తీస్ గడ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో భూంకాల్ మిలిషియా పోరాటం అత్యంత చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉంది. 1910లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భూంకాల్ ఉద్యమం బ్రిటీష్ పాలకులను గడగడలాడించింది. షహీద్ వీర్ గుండాధూర్ తో ఇతర పోరాట యోధులను స్మరించుకునేందుకు జగ్దల్ పూర్ లో ప్రత్యేకంగా స్మృతి వనం నిర్మించారు. ఆదివాసి పోరాట యోధుడు బగ ధృవ చేసిన తిరుగుబాటుతో అతనికి గుండాధుర్ అని బ్రిటిష్ అధికారులు పేరు పెట్టారు. బస్తర్ ప్రాంతమంతా కూడా రాజు రుద్ర ప్రతాప్ చేతిలో ఉన్నప్పటికీ ఆయన బ్రిటిష్ పాలకుల ఆంక్షల నడుమే పాలన కొనసాగించాల్సిన పరిస్థితులు ఉండేవి. దీంతో బ్రిటీష్ పాలకులపై తిరుగుబావుటా ఎగురవేసేందుకు నాయకత్వం వహించిందే గుండాధూర్. బానిస సంకెళ్ల విముక్తి కోసం గుండాధూర్ ఆదివాసీ బిడ్డలను చైతన్యపరిచి ట్రిడిషనల్ ఆర్మ్స్ (సాంప్రాదాయ ఆయుధాల)తో దాడులకు పూనుకున్నారు. ఆధునిక ఆయుధాలతో ఆదివాసీలపై ముప్పేట దాడి చేసిన సుమారు పది వేలమంది బ్రిటీష్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టడంలో గుండాధూర్ పాత్ర అనన్య సామన్యం. ఓ వైపున ఆదివాసీలను చైతన్య పరుస్తూనే మరో వైపును ఎదురు దాడులకు పూనుకుంటూ బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన 19వ శతాబ్దపు మేటి విప్లవకారుడు. ప్రపంచ ఆదివాసీల పోరాట చరిత్రలో బస్తర్ భూంకాల్ మిలీషియా పోరాటానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పాలి. సాయుధ బ్రిటీష్ సైన్యం చేతిలో విఫలం అయినప్పటికీ బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ పోరాటం వలస పాలకులు కూడా అచిర కాలం గుర్తు పెట్టుకున్న పరిస్థితి. కొంతమంది బ్రిటీష్ పాలకులు గుండాధూర్ సాహస పోరాటం గురించి వారి డైరీల్లో రాసుకున్నారంటే ఆయన పోరాటం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. 35 ఏళ్ల వయసులోనే గుండాధూర్ చేసిన పోరాట పటిమ గురించి నేటికీ బస్తర్ అటవీ ప్రాంత బిడ్డలు జానపాద బాణిలో పాటలు పాడుతూ స్మరించుకుంటుంటారు. ఆనాటి తిరుగుబాటుపై ఆగ్రహించిన బ్రిటీష్ పాలకులు జగ్దల్ పూర్ లోని గోల్ బజార్ చింతచెట్టు వద్ద పోరాట యోధులకు మరణశిక్ష విధించారు. ఆ పోరాట స్పూర్తితోనే నేటి తరం ఆదివాసీ బిడ్డలు జీవనం సాగిస్తున్నారంటే గుండాధూర్ వారి హృదాయాల్లో నిలిచిపోయాడంటే ఆయన ధైర్యం… సాహసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అదే స్పూర్తితో…
1910లో బస్తర్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న భూంకాల్ మిలీషియా పోరాటంపై సంపూర్ణ అవగాహన కల్గిన అప్పటి పీపుల్స్ వార్ వ్యూహాత్మకంగా అక్కడి ఆదివాసి బిడ్డలతో మమేకమైంది. క్రాంతీకారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని మావోయిస్టు పార్టీ నేటికీ కొనసాగిస్తోంది. సాయుధం ఉన్నవాడే సర్కార్ అన్న భావనతో ఉన్న అక్కడి ఆదివాసీలను 1990వ దశాబ్దం మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నం అయిన పీపుల్స్ వార్ అభూజామాడ్ ప్రాంతంలో తిరుగులేని పట్టు సాధించుకుంది. క్రమక్రమంగా పట్టు నిలుపుకున్న మావోయిస్టు పార్టీ బలగాలకు సవాల్ విసురుతూ ఆ కీకారణ్యాల్లోకి అడుగు పెట్టకుండా నిలువరించుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు నెమ్మదిగా అక్కడి అటవీ ప్రాంతంలోకి చొరబడి క్యాంపులను ఏర్పాటు చేసి నక్సల్స్ ఏరివేత కార్యక్రమాలపై దృష్టి సారించిన క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న సందర్భాలూ ఉన్నాయి. విప్లవ యోధుడు గుండాధూర్ ను స్మరిస్తూ చేపట్టే కార్యక్రమాలతో ఆదివాసీ బిడ్డలతో మమేకమైన మావోయిస్టలపై పట్టు సాధించేందుకు అభూజామడ్ పరిసర ప్రాంతాల్లో బలగాలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావనే చెప్పాలి.
ఇటు బలగాలూ…
అయితే తాజాగా ఆదివాసీల ఆరాధ్య దైవం, పోరాట యోధుడు షహీద్ గుండాధూర్ ను స్మరిస్తూ అక్కడి బలగాలు కూడా కార్యక్రమాలు చేపట్టాయి. అక్కడి ప్రభుత్వం గుండాధూర్ సేవలను స్మరిస్తూ అర్చరీ గేమ్స్ లో ఆయన పేరిట అవార్డులు ఇవ్వడంతో పాటు బస్తర్ సమీపంలోని నేతనార్ తో పాటు పలు చోట్ల ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఇక్కడి పోలీసులు కూడా భూంకాల్ పోరాటం జరిపిన 1910 ఫిబ్రవరి 10న గుండాధూర్ ను స్మరిస్తూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జగ్దల్ పూర్ లోని జై స్తంభ్ చౌక్ నుండి అమర్ వాటిక వరకు భూంకాల్ సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేఖచంద్ జైన్, మేయర్ సఫీరా సాహు, ఇంద్రావతి డెవలప్ మెంట్ అథారిటీ వైస్ రాజీవ్ శర్మ, బస్తర్ ఐజీ సుందర్ రాజ్, సీనియర్ ఎస్పీ జితేంద్ర మీనా తదిరులు పాల్గొన్నారు.