నాడు ఉద్రిక్తత… నేడు ప్రశాంతత… ఎఫెక్టెడ్ ఏరియాలో ఎలక్షన్ తీరు…

దిశ దశ, దండకారణ్యం:

అప్పుడా ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిందే. క్షణం ఒక యుగంలా జీవించాల్సిన పరిస్థితులు నాటివి. ఎన్నికల వాతావరణం మొదలయిందంటే చాలు ఆ ప్రాంతంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అంతా కూడా భయం గుప్పిట చేరిపోయే వారు. సామాన్యుల పరిస్థితి అయితే మరీ సంకట స్థితిలో కొట్టుమిట్టాడేది. అలాంటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా సాగుతున్నాయి అక్కడ ఎన్నికలు.

తెలంగాణా అంటేనే…

రాష్ట్రంలో తెలంగాణ అంటేనే హడలిపోయే పరిస్థితి ఉండేది. పీపుల్స్ వార్ నక్సల్స్ కు పట్టున్న ప్రాంతాల్లో ఎన్నికల బహిష్కరణ నినాదం ఊపందుకునేది. అయితే నక్సల్స్ పిలుపును తిప్పికొట్టాలంటే పీపుల్స్ వార్ ఖిల్లాలో ఎన్నికలు సాఫీగా జరిపించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉండేది. దీంతో పోలీసు యంత్రాంగం అంతా నక్సల్స్ ఏరివేత పనిలో నిమగ్నం అయ్యేవారు. ఎలాంటి ప్రాణ నష్టం జరకుండా, బ్యాలెట్ పేపర్లు డ్యామేజ్ కాకుండా గమ్య స్థానాలకు చేరితే చాలు అదో రికార్డు అన్నట్టుగా ఉండేది. బ్యాలెట్ బాక్సులు పోలింగ్ బూతులకు చేరవేయాలన్నా, పోలింగ్ ముగిసిన తరువాత వాటిని స్ట్రాంగ్ రూంలకు తరలించాలన్నా కూడా కాలి బాటనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. మందుపాతరలు పేల్చుతారో, క్లైమోర్ మైన్స్ కి పనిచెప్తారో, తుపాకులతో తూటాలు కక్కిస్తారా అన్నది తెలియక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గజగజ వణుకుతూనే కాలం వెల్లేదీసేది. పీపుల్స్ వార్ నక్సల్స్ చర్యలతో అట్టుడికిపోతున్న ఆ పరిస్థితుల్లోనూ పోలీసు యంత్రాంగం అంతా కూడా కంటిమీద కునుకు లేకుండా కాలం వెల్లదీసేది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల విధులు నిర్వర్తించేవారు. కేంద్ర పారా మిలటరీ బలగాలు, పోలీసులను చూసి గ్రామాల్లోని జనం కూడా బయటకు వచ్చే వారు కాదు. దీంతో భద్రాతా వలయాన్ని ఏర్పర్చుకుని పోలీసులే పీపుల్స్ వార్ ప్రాబల్య ప్రాంత గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను బూతులకు తీసుకొచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి భయానక పరిస్థితుల్లోనూ నక్సల్స్ ఏదో సమయంలో బూతుల్లోకి చొరబడి బ్యాలెట్ బాక్సుల్లో ఇంక్ పోయడం, బ్యాలెట్ పేపర్లను చింపివేయడం సర్వసాధారణంగా జరిగేది. దీంతో మళ్లీ ఆ గ్రామాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు అధికారయంత్రాంగం సమాయత్తం అయ్యేది. బ్యాలెట్ బాక్సులు సేఫ్ గా స్ట్రాంగ్ రూంలోకి తరలించడం ఒక ఎత్తైతే నక్సల్స్ దాడులను తప్పించుకుని రావడం మరో ఎత్తుగా సాగేది ఆనాడు.

నేడు పూర్తిగా భిన్నం…

అయితే 2009 ఎన్నికల వరకు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న ప్రభుత్వ యంత్రాంగం ఆ తరువాత స్వేచ్ఛగా ఎన్నికల విధులు నిర్వర్తించే పరిస్థితికి చేరుకుంది. తెలంగాణాలోని పలు పల్లెల్లో పీపుల్స్ వార్ పట్టు సడలిపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఎంసీసీలో విలీనం అయిన తరువాత మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన పీపుల్స్ వార్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో నక్సల్స్ కార్యకలాపాలు చత్తీస్ గడ్ తో పాటు ఇతర రాష్ట్రాలకే పరిమితం కాగా తెలంగాణాలో పూర్తి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. గత నాలుగు సాధారణ ఎన్నికల్లో కూడా విధ్వంసాలకు తావు లేకుండా, అన్నల ఉనికి లేకుండా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇంటింటికి తిరిగి పోలింగ్ లో పాల్గేనేందుకు తిరిగిన పరిస్థితులకు భిన్నంగా నేడు ఆయా ప్రాంతాల్లోని ఓటర్లే స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతాన్ని అనుకుని ఉన్న తెలంగాణాలోని ఐదు జిల్లాల్లో పోలీసులు మాత్రం కట్టడి చర్యలు తీసుకోవడంలో కఠినంగా వ్యవహరించారు. దీంతో ఈ సారి ఎన్నికలు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముగిసాయి. కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసి పోలీసులు గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పినట్టయింది. ఒకప్పుడు మందుపాతరలకు బలైన పోలీసులు నేడు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ గుర్తించడంలో సఫలం అయ్యారు. ఒకప్పుడు పోలింగులో పాల్గొనాలంటే విముఖత చూపిన ఓటర్లు ఇప్పుడు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆనాడు నక్సల్స్ కు పెట్టనికోటగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్ల పల్మెల మండలంలో ఈ సారి 90.82 శాతం పోలింగ్ జరగడమే ఇందుకు ఉదాహారణగా చెప్పవచ్చు.

ఆ బ్యాచులే కీలకం…

అయితే తెలంగాణాలో వేళ్లూనుకున్న నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో 1985 నుండి 1996 బ్యాచ్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమనే చెప్పవచ్చు. కొంతమేర 2002 బ్యాచ్ పోలీసు అధికారులు కూడా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఏ రూపంలో వారిని మృత్యువు కబళించుకపోతుందోనన్న దయనీయ పరిస్థితుల్లో ఆనాటి పోలీసు అధికారులు విధులు నిర్వర్తించారు. తమ బ్యాచ్ పోలీసు అధికారులు నక్సల్స్ చర్యల్లో ప్రాణాలు వదిలారన్న విషయం తెలిసినా అడవి బాట పట్టక తప్పలేదు చాలా మంది పోలీసు అధికారులకు. భయానక పరిస్థితుల్లో తమ బాధలను దిగమింగుకుంటూ ప్రాణాలను ఫణంగా పెడుతూ ముందుకు సాగిన ఘనమైన చరిత్ర వీరికే దక్కుతుంది. ఆయా బ్యాచ్ లకు చెందిన వరంగల్ జోన్ పోలీసు అధికారులు పోలీస్ స్టేషన్లు, కుటుంబ సభ్యులను విడిచి మరీ అడవుల్లో నక్సల్స్ ఏరివేత పనిలో నిమగ్నం అయ్యేవారు. రోజులకొద్ది అడవుల్లోనే తిరుగుతూ నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో సఫలం అయ్యారు.

You cannot copy content of this page