ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్సీలే ప్రత్యర్థులు

ఏ ఎన్నికలైనా వారి మధ్యే వార్…

దిశ దశ, జగిత్యాల:

రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న ఆ సెగ్మెంట్ లో మరో వైవిద్యత చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలంటే చాలు అక్కడ నెలకొనే రాజకీయ పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ జరుగుతున్న పోరును గమనిస్తే అత్యంత విచిత్రంగా ఉంటుందక్కడ. అభ్యర్థి కన్నా ఎక్కువగా ప్రత్యర్థులు ఆ ఇద్దరే ప్రధాన ప్రత్యర్థులు అన్నట్టుగా కొనసాగుతున్నాయి అక్కడ ఎన్నికలు.

ఆ ఖిల్లాలో వెరైటీ…

చైతన్యానికి పెట్టింది పేరైన జగిత్యాలలో తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆ ఇద్దరు ముఖ్య నేతల మధ్యే పోటీ జరుగుతుందా అన్న అనుమానం రాక మానదు. అధికారికంగా పోటీ చేసే అభ్యర్థి వేరే అయినా మాటల యుద్దం నుండి ప్రచారం వరకు కూడా వీరిద్దరే ప్రత్యర్థులే అన్నట్టుగా సాగుతోంది. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల మధ్యే ఎన్నికల పోరు సాగుతున్నట్టుగా ఉంటోంది. 2014 ఎన్నికల నుండి తాజాగా జరుగుతున్న ఈ ఎన్నికల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశం. మూడు ఎన్నికల్లోనూ గులాభి పార్టీ నుండి డాక్టర్ సంజయ్ అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్ రెడ్డి మాత్రం కల్వకుంట్ల కవితతోనే తలపడుతున్నట్టుగా ఉంటోంది.

అనూహ్య పరిణామాలు…

కంటి డాక్టర్ గా ఇమేజ్ ఉన్న డాక్టర్ సంజయ్ ని జగిత్యాల నుండి పోటీ చేయించడంలో కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారనే చెప్పాలి. రాజకీయాలతో అంతగా టచ్ లేని సంజయ్ ని కవిత ఏరికోరి జగిత్యాల అభ్యర్థిగా ఎంపిక చేయించారు. 2014 ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ కి టికెట్ ఇప్పించిన కవిత ఆయనను బరిలో నిలబెట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రత్యక్ష్యంగా చేపట్టారు. అప్పుడు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న కవిత తన గెలుపుతో పాటు డాక్టర్ సంజయ్ గెలుపును సవాల్ గా తీసుకున్నారు. అయితే అప్పుడు జీవన్ రెడ్డి కూడా కవిత ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన గెలుపునకు ముందుకు సాగాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలవడంతో డాక్టర్ సంజయ్ తొలి ప్రయత్నంలో విఫలం అయ్యారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత తన దృష్టినంతా కూడా జగిత్యాలపైనే ఎక్కువగా సారించి ఏ కార్యక్రమం చేపట్టినా ఫస్ట్ ప్రయారిటీ జగిత్యాలకే ఇచ్చేందుకు ఆమె ఆసక్తి చూపారు. ఈ క్రమంలో మన ఊరిలో మన ఎంపీ అన్న కార్యక్రమాన్ని కూడా కవిత జగిత్యాల నియోజకవర్గంలోనే చేపట్టి జీవన్ రెడ్డిపై పైచేయిగా గులాభి దండు నిలబడాలని ప్రయత్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాలలోనే మకాం వేసి మరీ డాక్టర్ సంజయ్ గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. డాక్టర్ సంజయ్ ని గెలిపించాలన్న పంథం కంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతపై తమ పార్టీ అభ్యర్థి గెలవాలన్న లక్ష్యంతో పావులు కదిపి సక్సెస్ అయ్యారు. ఓటమి పాలైన జీవన్ రెడ్డి లోకసభ ఎన్నికల్లో కవితే ఓటమే లక్ష్యంగా పావులు కదిపారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా, కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై ఒకే సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి తన ప్రత్యర్థిగా బరిలో నిలుస్తున్న డాక్టర్ సంజయ్ ని కాకుండా ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఆరంభించారు. ఈ క్రమంలో బీఈర్ఎస్ పార్టీ నాయకులు కూడా కౌంటర్ అటాక్ కు దిగుతున్నప్పటికీ కవిత సంధించిన తీరే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కాకుండా, జీవన్ రెడ్డి వర్సెస్ కవిత అన్న రీతిలో మాటల యుద్దం మొదలైంది. కల్వకుంట్ల కవిత కూడా వ్యూహాత్మకుంగా జగిత్యాల జిల్లాపైనే ప్రత్యేక దృష్టి సారించి తమ పార్టీ అభ్యర్థులు గెలుపునకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కవిత జగిత్యాలలో మళ్లీ జీవన్ రెడ్డిపై సంజయ్ ని గెలిపించి మరో సారి సక్సెస్ కావాలని వ్యూహ రచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కవిత, జీవన్ రెడ్డిల మధ్యే పోటీ అన్నట్టుగా సాగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ మొదలైంది.

You cannot copy content of this page