ఉధ్దండుల మధ్య పొలిటికల్ వార్…

అరుదైన ఘటనకు వేదికైన ఎన్నికలు

ఆ రెండు స్థానాలు ప్రత్యేకం…

దిశ దశ, హైదరాబాద్:

ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై అందరి దృష్టి ఉంటుంది. వారిపై పోటీ చేసే ప్రత్యర్థుల గురించి కూడా ఆరా తీసేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఆయా పార్టీల వీఐపీలు నిలబడ్డ స్థానాల్లో సాధారణ నాయకులు పోటీ చేస్తారని వారి గెలుపు సునాయసమేనన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారూ లేకపోలేదు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ప్రముఖుల మధ్యే జరుగుతుండడంతో అరుదైనవిగా చెప్పవచ్చు.

అరుదైన చరిత్రే…

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ప్రముఖులు పోటీ చేసే స్థానాల్లో నామమాత్రపు పోటీ ఉన్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎక్కడో ఓ చోట సాహసించి బరిలో నిలిచిన వీఐపీలపై గెలిచిన సందర్భాలు అతి తక్కువేనని చెప్పవచ్చు. భారత ప్రధానిగా పీవి నరసింహరావు ఎన్నికైన తరువాత తెలుగువాడిగా నంద్యాల నుండి పోటీ చేయాలని అప్పటి ఎంపీ రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాలీ అయిన తరువాత ఆయనపై టీడీపీ తరుపున ఎవరూ కూడా పోటీ చేయరని ఎన్టీరామారావు ప్రకటించగా బీజేపీ మాత్రం ఆ పార్టీ జాతీయ నేత బంగారు లక్ష్మణ్ ను బరిలో నిలిపింది. అప్పుడు పివి నరసింహరావు 4 లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచి రికార్డు అందుకున్నారు. అంతకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్టీరామారావు హిందూపురం నుండి, కల్వకుర్తి నుండి పోటీ చేశారు. కల్వకుర్తి నుండి పోటీ చేసిన ఎన్టీరామారావుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తరంజన్ దాస్ విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇలాంటి సందర్భాలు మాత్రం రాష్ట్ర చరిత్రలో అత్యంత తక్కువేనని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలో రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు, టీడీపీ నుండి మాజీ మంత్రి ఎల్ రమణ, కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రస్తుత ఎమ్మెల్సీ, ప్రస్తుత జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి, పోటీ చేసి ఓటమి పాలయ్యారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ అంతటా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో కూడా ఉద్యమనేత కేసీఆర్ పై పోటీ చేయడం గమనార్హం.

ఈ సారి మాత్రం…

అయితే ఈ సారి తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు అత్యంత అరుదైన చరిత్రను అందుకున్నాయనే చెప్పాలి. గజ్వేల్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా కేసీఆర్ కు ఒకప్పటి అనుచరుడు, బీజేపీ ఎన్నికల నిర్వహాన కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్య నాయకుడిగా ఎదిగిన ఈటల రాజేందర్, కేసీఆర్ పై పోటీ చేస్తుండడంతో సీనియర్ నేతలు ఇద్దరు ఇక్కడి నుండి తలపడుతున్నారు. మరో వైపున ఈ సారి కేసీఆర్ కామారెడ్డి నుండి కూడా పోటీ చేస్తుండగా అక్కడి నుండి ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కూడా ప్రత్యర్థులుగా ప్రముఖులే పోటీ చేస్తుండడం గమనార్హం. అత్యంత బలమైన అభ్యర్థిగా ఉన్న కేసీఆర్ పై అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు కూడా కీలక నేతలను పోటీ చేయించడం విశేషం. వీఐపీలపై వీఐపీలు పోటీ చేసే సంస్కృతి అతి తక్కువ సందర్భాల్లో చోటు చేసుకోనున్న నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ప్రముఖుల మధ్యే పోటీ చేసేందుకు వేదికగా నిలవడం ప్రత్యేకతను చాటుకుంటోంది.

You cannot copy content of this page