ఆది భిక్షువు క్షేత్రంలో ప్రత్యక్ష్య పోరు…

ముచ్చటగా మూడో ప్రయత్నం…

ఐదోసారి బరిలో దిగిన శ్రీనివాస్

తొలిసారి కమల ‘వికాసం’

దిశ దశ, వేములవాడ:

ఆది భిక్షువు వెలసిన క్షేత్రంలో మరోసారి ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ప్రజా క్షేత్రంలోకి దిగిన అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోబోతున్నారు. ఐదో సారి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రజల మద్దతు కోరుతుండగా, ముచ్చటగా మూడో సారి తన భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావు. ఇక పోతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రయత్నంలోనే టికెట్ అందుకున్న బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

2009 నుండి…

వేములవాడ ప్రజల మద్దతు కోసం ప్రయత్నిస్తూ విఫలం అవుతున్న ఆది శ్రీనివాస్ ఐదో సారి కూడా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన 2009 నుండి వరసగా నిలబడ్డారు. ఈ సారి ప్రత్యర్థులు మారడంతో తన తలరాత మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్న ఆయనకు మద్దతుగా బీసీ కార్డు బలంగా వినిపించే ప్రయత్నం సాగుతోంది. మరో వైపున ఇంతకాలం ఎక్కడ అయితే ఓటర్లను ఆకట్టుకోలేకపోయాడో ఆ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న అభ్యర్థులు మాత్రం తనకన్నా జూనియర్లు కావడం లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు సార్లు వేములవాడ రాజన్న ఆలయ ఛైర్మన్ గా పనిచేసిన ఆయన జడ్పీటీసీగా ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఎన్నికయ్యారు. ఈ సారైనా నాకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ ప్రజా క్షేత్రంలో అందరికన్నా ముందు నుండే తిరుగుతున్నారు. ఈ సారి వేములవాడ ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

అనూహ్య పరిణామాలు…

బీఆర్ఎస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును కాదని చల్మెడ లక్ష్మీ నరసింహరావు అభ్యర్థిత్వం వైపు బీఆర్ఎస్ పా్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అత్యంత బలమైన అభ్యర్థిగా ముద్రపడ్డ రమేష్ బాబు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపిన గులాభి పార్టీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్టయింది. ఓ సారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలు కాగా 2014 ఎన్నికల్లో కరీంనగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపును అందుకోలేకపోయారు చల్మెడ లక్ష్మీ నరసింహరావు. ఇటీవలె బీఆర్ఎస్ పార్టీలో చేరి మూడోసారి ఎన్నికల బరిలో నిల్చున్నారు. కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన చల్మెడ లక్ష్మీ నరసింహరావు తండ్రి ఆనందరావు టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పని చేశారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చల్మెడ ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మద్దుతు చల్మెడకు అత్యంత కీలకం. ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి అందించినట్టయితే లాభించే అవకాశాలు ఉంటాయి. లేనట్టయితే పార్టీ తీరని నష్టం ఎదుర్కునే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రమేష్ బాబుకు క్యాబినెట్ హోదా కట్టబెట్టినప్పటికీ ఆయన మాత్రం ఎన్నికల్లో క్రియాశీలక పాత్రో పోషించడం లేదన్ వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జర్మనిలో ఉన్న ఆయన చివరి నిమిషంలో తన వర్గానికి ఎలాంటి సూచనలు చేస్తారోనన్నదే మిస్టరీగా మారింది.

కమలంలో ‘వికాసం’

తొలిసారి బరిలో నిలుస్తున్న చెన్నమనేని వికాసరావు బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. కోనరావుపేట నాగారం గ్రామానికి చెందిన వికాసరావు తన తండ్రి సిహెచ్ విద్యాసాగర్ రావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కొన్నేళ్లుగా వేములవాడ ప్రాంతంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, అత్యాధునిక అంబూలెన్స్ ల ద్వారా సేవలందించడం వంటి ఛారిటీ పనుల్లో నిమగ్నం అయిన వికాసరావు తన తండ్రి కొనసాగిన పార్టీలోనే టికెట్ కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుకు జాతీయ నాయకులతో ఉన్న సంబంధాలతో పాటు స్థానిక నాయకత్వం కూడా అండగా నిలవడంతో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు. అయితే నియోజకవర్గంలో డాక్టర్ వికాస్ రావు ఛారిటీ ద్వారా సంబంధాలు పెంచుకోవడంతో పాటు తండ్రికి ఉన్న వ్యక్తిగత పరిచయాలు లాభిస్తాయని భావిస్తున్నారు. మరో వైపున ఈ సారి చెన్నమనేని రమేష్ బాబు బరిలో లేకపోవడం కూడా తమకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో చెన్నమనేని కుటుంబం బరిలో లేకుండా ఉన్న తొలి ఎన్నికలు అవుతున్నాయని భావించినప్పటికీ చివరి నిమిషంలో వికాస్ రావు అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేయడంతో ఈ ఎన్నికల్లో కూడా ఆ కుటుంబం ప్రాతినిథ్యం ఉన్నట్టయింది.

మెడికల్ కాలేజీలు…

అయితే వేములవాడ రాజన్న క్షేత్రంలో బరిలో నిలిచిన ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా మెడికల్ కాలేజీలతో అనుబంధం ఉన్న వారే. బీఆర్ఎస్ అభ్మర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావు కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ లో కెయిమ్స్ మెడికల్ కాలేజీ నిర్వహిస్తుండగా, బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యులకు కరీంనగర్ సమీపంలోని నగునూరు ప్రతిమ హస్పిటల్ లో భాగస్వామ్యం ఉండడం విశేషం. వీరిద్దిరిది కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో బీజేపీ నుండి వికాస రావుకు టికెట్ రానట్టయితే తమకు బావుంటుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశించాయి. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ వికాసరావుకు టికెట్ ఇవ్వడంతో ఇక్కడి ఎన్నికల్లో టఫ్ ఫైట్ గా మారిపోయినట్టయింది.

You cannot copy content of this page