తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా.. కారణం అదేనా..?

కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. గతంలో అనేకసార్లు వాయిదా పడగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి అడ్డంకి ఏర్పడింది. దీంతో ఈ నెల 17న జరగాల్సిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది.

గత నెలలో సంక్రాంతి రోజున కొత్త సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సచివాలయం లోపల కొన్ని పనలు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం ఉండటంతో.. ఆ రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రోజున కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. కానీ అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం గురువారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా.. శనివారం నోటిఫికేషన్ కూడా వచ్చేసింది.

నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. కోడ్ అమల్లో ఉంటే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడం నిబంధనలకు విరుద్దం. దీంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ నెల 17న సచివాలయం ప్రారంభించుకోవడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నామని, అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సి వచ్చింది.

ఎన్నికల కోడ్ వల్ల సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయల్సి వచ్చిందని, త్వరలోనే మరో తేదీని ఫిక్స్ చేస్తామని ప్రభుత్వం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సచివాలయంలో లోపల ఎలక్ట్రిక్ వర్క్, మిగతా పనులు ఇంకా కొన్ని జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంచి ముహూర్తాన ప్రభుత్వం సచివాలయాన్ని ప్రారంభించనుందని తెలుస్తోంది.

You cannot copy content of this page