దిశ దశ, భూపాలపల్లి:
మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ స్మారక స్థూపాన్ని ఆయన ఇంటి వద్ద ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదిన చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో సంతోష్ మరణించాడు. బీజాపూర్ జిల్లా పూజార్ కాంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో సంతోష్ చనిపోయాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దస్తగిరిపల్లికి చెందిన సంతోష్ దాదాపు 25 ఏళ్ల క్రితం సాయుధ పోరాటం వైపు వెల్లిపోయారు. మహదేవపూర్ ప్రాంతంలో పీపుల్స్ వార్ నక్సల్స్ కార్యకలాపాలు తగ్గిపోవడంతో దండకారణ్య జోన్ కు బదిలీ అయ్యాడు. అప్పటి నుండి వివిధ హోదాల్లో పనిచేసిన సంతోష్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎదిగారు. సీఆర్సీ 2 దండకారణ్య జోనల్ కమిటీ కమండార్ గా, తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ బాధ్యునిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టుగా సమాచారం. రూ. 25 లక్షల రివార్డు ఉన్న అన్నె సంతోష్ అంత్యక్రియలు అతని తల్లిదండ్రలు దస్తగిరిపల్లిలో నిర్వహించారు. సోమవారం ఆయన స్మారకార్థం నిర్మించిన స్థూపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రుల కమిటీ అధ్యక్షురాలు అంజమ్మ, ప్రధాన కార్యదర్శి పద్మ కుమారి, ట్రెజరర్ శాంత, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్ నారాయణ, విరసం నేత రాజన్నలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్లవపంథాలో పయనించిన అన్నె సంతోష్ పోరాటం గురించి వక్తలు కొనియాడారు.