దిశ దశ, దండకారణ్యం:
శతాబ్దాల నాటి కల సాకారం అవుతున్న వేళ ఇది. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడో ఉత్తర భారతాన జన్మించిన శ్రీరాముడి జన్మస్థలంలో భవ్యమైన మందిరం నిర్మించారని తెలిసి దక్షిణాదిలోని అటవీ ప్రాంతాల్లో కూడా ఉత్సవాలకు సిద్దమవుతున్నారు. మరికొన్ని గంటల్లో జరగనున్న ఈ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను కనులారా వీక్షించలేకున్నా ఆయనపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. ఊరు వాడా అన్న తేడా లేకుండా ప్రతి చోట కూడా శ్రీరాముని మందిరం నిర్మాణం పురస్కరించుకుని భక్తులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్పారు. అయితే రఘు రాముడి ప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో అటవీ ప్రాంతంలోని పల్లెలు కూడా సంబరాలను జరుపుకుంటున్నాయి. కుగ్రామాల్లో కూడా రాములోరి ఆలయం కట్టారన్న సంతోషం కనిపిస్తోంది. కీకారణ్యాల్లోని జనం కూడా ఒక రోజు ముందు నుండే ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం పురస్కరించుకుని సీతా రాముల చిత్ర పటాలను, విగ్రహాలను ఏర్పాటు చేసి కాషాయ జెండాలతో అలంకరించారు. వనవాసంలో భాగంగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతితో పాటు పలు ఉప నదుల ప్రవహించే దండకారణ్య అటవీ ప్రాంతంలో శ్రీరాముడు సంచరించాడు. ఆనాడు ఆయన అడుగిడిన ఆ అటవీ ప్రాంతానికి చెందిన భక్తులు నేటికీ భక్తి పారవశ్యంలో తన్మయత్మం చెందుతున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని మారుమూల పల్లెల్లో సైతం శ్రీరామ జన్మభూమిలో ఆయన మందిర నిర్మాణం జరుగుతుండడంపై ఆనందం వ్యక్తం అవుతోంది. ఆ సీతా రాముడి ఆలయంలో సోమవారం ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో సిరొంచ తాలుకాలోని అటవీ గ్రామాల్లో సైతం శ్రీరాముడిని పూజించేందుకు సన్నద్దమయ్యారు.
గుడి లేకున్నా…
సిరొంచ తాలుకాలోని మాణిక్యాపూర్ గ్రామంలో ఆలయం లేకున్నప్పటికీ స్థానికులు కొంత ఖాళీ ప్రదేశాన్నిచదును చేసి చిన్న పందిరి వేసి సీతారాములు విగ్రహం, చిత్ర పటాలను ఏర్పాటు చేశారు. ఆవరణ అంతా కూడా కాషాయ జెండాలను ఏర్పాటు చేసిన భక్తులు సోమవారం నాటి ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకుని శ్రీరాముడిని స్మరించేందుకు సిద్దమయ్యారు. అటవీ ప్రాంతంలో కూడా శ్రీ రాముడి భవ్య మందిర నిర్మాణం ప్రభావం కనిపించడం విశేషమనే చెప్పాలి. శ్రీరామ ప్రతిష్టాపన పురస్కరించుకుని సిరొంచ తాలుకాలోని అటవీ గ్రామాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని జర్నలిస్ట్ అమిత్ కుమార్ త్రిపట్టి వార్ తెలిపారు. అటవీ ప్రాంతాల్లో కూడా అయోధ్య రామ మందరి నిర్మాణం ఎఫెక్ట్ కనిపిస్తోందని వివరించారు. చాలా చోట్ల కూడా ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలే స్వచ్ఛందంగా ఉత్సవాలు జరిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఎలాంటి ఆలయం లేకున్నా రామునిపై భక్తిని ప్రదర్శిస్తున్నారన్నారు.