నదుల మీదుగా వరదలా… అక్రమ రవాణా జోరు…

దిశ దశ; దండకారణ్యం:

తెలంగాణ సరిహధ్దు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదుల మీదుగా అక్రమ రవాణా జోరు సాగుతోంది. అధికారుల కళ్లు గప్పి హైవేల మీదుగా సాగుతున్న స్మగ్లింగ్ తంతుకు పోలీసులు బ్రేకులేస్తున్నా దందా చేస్తున్న వారు మాత్రం మారడం లేదు. దీంతో కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ప్రాణహిత, గోదావరి నదుల మీదుగా జోరుగా అక్రమ రవాణా సాగుతోంది.

రేషన్ బియ్యం అలా…

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి సేకరిస్తున్న పీడీఎస్ బియ్యం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు తరలి వెల్తున్నాయి. నిత్యకృత్యంగా సాగుతున్న ఈ తంతు వెనక పెద్ద మాఫియానే ఉన్నప్పటికీ కట్టడి చేసే వారు లేకుండా పోయారు. బార్డర్ దాటితే చాలు స్మగ్లర్లు సేఫ్ జోన్ లోకి ఎంటర్ అయ్యామన్న ధీమాతో కాలం వెల్లదీస్తున్నారు. ఓ వ్యాపారి సిరొంచ సమీపంలో బియ్యం కొనుగోళ్ల ప్రక్రియను యథేచ్ఛగా సాగిస్తున్న గడ్చిరోలి జిల్లా యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు అదనపు ఆదాయం వస్తోందన్న సంతోషంతో అక్కడి అధికార యంత్రాంగం ఉంటున్నప్పటికీ అసలు ఆ ప్రాంతంలో సాగవుతున్న వరి కంటే ఎక్కువగా బియ్యం ఎలా పుట్టుకొస్తున్నాయి అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మహారాష్ట్రలో బియ్యంపై ఎలాంటి కట్టడి చర్యలు లేకపోవడంతో సరిహధ్దులు దాటిస్తే చాలు తాము సేఫ్ జోన్ లోకి చేరుకున్నామన్న ధీమాతో ఉంటున్నారు అక్రమ వ్యాపారులు. అధికారికంగా అక్కడి ప్రభుత్వానికి సిరొంచ ప్రాంతం నుండి వస్తున్న ఆదాయం లెక్కలను పరిశీలిస్తే బియ్యం అక్రమ రవాణా గుట్టు పక్కాగా తెలిసే అవకాశం ఉంది. సిరొంచ తాలుకాలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత విస్తీర్ణంలో ఉంది..? అందులో ఏఏ పంటలు పండుతాయి..? వరి సాగు ఎంత మొత్తంలో అవుతోంది అన్న వివరాలను, బియ్యం రవాణాపై సిరొంచ ప్రాంతం నుండి వస్తున్న ఆదాయాన్ని సరి చూసినట్టయితే రేషన్ బియ్యం దందా గుట్టు రట్టు అవుతుంది. కానీ తెలంగాణకు చెందిన సివిల్ సప్లై అధికారులు, మహారాష్ట్రకు చెందిన అధికారులు సంయుక్తంగా రేషన్ బియ్యం స్కాంపై దృష్టి సారిస్తే పక్కగా అక్కడ సాగుతున్న దందా బట్ట బయలు కానుంది.

మద్యం ఇలా….

ఇకపోతే తెలంగాణ నుండి భారీ ఎత్తున మద్యం గడ్చిరోలి జిల్లాకు చేరుతోంది. 1993లో ఆదివాసి జిల్లా అయిన గడ్చిరోలిలో అక్కడి ప్రభుత్వం మద్యం విక్రయాలను నిలిపివేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. 30 ఏళ్లుగా ఆ జిల్లాలో మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేస్తే తెలంగాణ మద్యాన్ని అక్కడ ఏరులై పారిస్తున్నారు. ఇటీవల కాలంలో అయితే మద్యం అమ్మకాలు తీవ్రంగా పెరిగిపోయాయి. బార్డర్ ఏరియాలతో పాటు సమీపంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన మద్యం షాపుల నుండి పెద్ద ఎత్తున లిక్కర్ సరిహద్దులు దాటి వెల్తోంది. తెలంగాణ లిక్కర్ బెల్ట్ షాపులు గడ్చిరోలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. సిరొంచ తాలుకాలో అయితే బెల్టుషాపు లేని గ్రామం ఉండదు కావచ్చని అక్కడి వారే చెప్తున్నారు. తాజాగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని భీమారం సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు లిక్కర్ తరలిస్తున్న వాహానాన్ని పట్టుకున్నారు. AP 01TV 4055 అనే నెంబరు గల వాహనంలో రూ. 2 లక్షల విలువైన వివిధ రకాల బ్రాండ్ల లిక్కర్ తో పాటు బీర్లు మహారాష్ట్రకు తరలిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. గడ్చిరోలి జిల్లాకు లిక్కర్ సరఫరా చేయోచ్చన్న కారణంతోనే సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైన్ షాపులు టెండర్లలో ధరలు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఒక్కో వైన్ షాపు పరిధిలో అతి తక్కువగా గ్రామాలు, తక్కువ సంఖ్యలోనే జనాభా ఉన్న రూ. కోట్లలో లిక్కర్ దందా ఎలా చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. కేవలం మహారాష్ట్రకు అక్రమంగా మద్యం తరలించేందుకే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని వైన్ షాపులకు లైసెన్స్ ఫీజులు పెంచడానికి ప్రధాన కారణం గడ్చిరోలి జిల్లాలో మద్య నిషేధం అమల్లో ఉండడమేనన్నది బహిరంగ రహస్యం. తాజాగా రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టుకున్న లిక్కర్ వెహికిల్ ఆధారంగా సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page