గర్భంలో మాప్ కథ
మొన్న అలా… నేడు ఇలా
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల హస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకున్న మహిళ గర్భంలో మాప్ లభ్యమైన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట ఆమె గర్భంలో బయటపడ్డ న్యాప్ కిన్ (మాప్)కు జగిత్యాల ఏరియా అసుపత్రి యంత్రాంగం తప్పిదం లేదన్న రీతిలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాకు నివేదిక ఇచ్చారు త్రిసభ్య కమిటీ ప్రతినిధులు. బాధితురాలి నుండి వాంగ్మూలం ఫోన్లో కాకుండా నేరుగా తీసుకోవాలని, స్కానింగ్ సెంటర్ లో కూడా ఆరా తీయాలని, ప్రత్యేకంగా వెల్లి విచారించాలని త్రిసభ్య కమిటీని ఆదేశించారు. దీంతో త్రిమేన్ కమిటీ సభ్యులు గురువారం బాన్సువాడకు వెళ్లి కులంకశంగా ఆరా తీశారు. మరో వైపు బాధితురాలి బంధువులు గురువారం జగిత్యాల కలెక్టర్ ను కలిసి తమను పూర్తిగా విచారించకుండా నివేదిక ఇచ్చారని ఆరోపించారు.
బాధితురాలితో ఫోన్లో మాట్లాడినప్పుడు పూర్తి వివరాలు అడగకుండానే నివేదిక ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ యాస్మిన్ భాషా ఆదేశాలతో కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి రిపోర్ట్ అందించింది.
తాజా రిపోర్ట్ ఇలా…
అయితే తాజాగా బాన్సువాడ వెల్లి ఆరా తీసిన కమిటీ శుక్రవారం జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు బాధితురాలి కథనం ప్రకారం 2016, 2020, 2022లో మూడు సార్లు సిజేరియన్ చేయించుకుందని తేల్చారు. ఆమె చివరగా జగిత్యాల సర్కారు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారని తేల్చారు. కొంతకాలంగా బ్లీడింగ్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ క్రమంలో పలు చోట్ల చికిత్స చేయించుకున్నారని వివరించారు. నిజామాబాద్ స్కానింగ్ సెంటర్ లో ఆమె గర్భంలో మాప్ ఉన్నట్టు తేలిందని ఇందుకు సంబంధించి సర్జరీ వేములవాలో చేయించుకున్నారని బాధితురాలు చెప్పినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఆమె చిట్టచివరగా ఆపరేషన్ జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చేయించుకున్నారని కూడా అభిప్రాయపడింది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను జిల్లా కలెక్టర్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు పంపించినట్టు సమాచారం.
మాప్ చుట్టే మలుపులు…
అయితే త్రిసభ్య కమిటీ ఇచ్చిన వేర్వేరు నివేదికలు అందరినీ అయోమయానికి గురిచేసేలా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఇచ్చిన నివేదికలో 10/10 సైజ్ మాప్ ఆమె గర్భంలో ఉందని, జగిత్యాల ఆసుపత్రిలో 6/6 సైజ్ న్యాప్ కిన్స్ మాత్రమే వాడుతున్నారని కమిటీ ప్రతినిధులు చెప్పారు. అంతేకాకుండా రెండు నెలల తర్వాత మాప్ డ్యామేజ్ అవుతుందని కూడా తెలిపారు. అయితే రెండో నివేదికలో మాత్రం జగిత్యాల ఆపరేషన్ చివరిదని గుర్తించడం గమనార్హం. 2021లో ఆపరేషన్ చేయించుకున్న బాధితురాలు గర్భంలో బయటపడ్డ మాప్ డ్యామేజ్ కాలేదన్న విషయాన్ని కూడా తొలిసారి విచారణ చేసినప్పుడు కమిటీ ప్రతినిధులు చెప్పడం ప్రస్తావనార్హం. ఆ తరువాత ఆమె ఎక్కడైనా ఆపరేషన్ చేయించుకుని ఉంటుందన్న కోణంలో కమిటీ అనుమానాలు వ్యక్తం చేసినట్టు వారి మాటలు చెప్పకనే చెప్పాయి. 10/10 సైజు మాప్ బాధితురాలి గర్భం నుండి బయట పడడంతో ఇది జగిత్యాల ఏరియా ఆసుపత్రికి ఎలా చేరిందోనన్న విషయం తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. 6/6 సైజ్ న్యాప్ కిన్స్ మాత్రమే వాడుతున్నారని తేల్చినప్పుడు బాధితురాలి గర్భంలోకి అంతకన్నా పెద్ద సైజు బయటపడిందంటే లోపం ఎక్కడ జరిగిందోనన్నది మిస్టరీగా మారింది. ఆపరేషన్ జరిగిన రోజున థియేటర్ డ్యూటీలో ఉన్న వారు న్యాప్ కిన్స్ తో పాటు ఇతరాత్ర మెటిరియల్ ఇచ్చి, తిరిగి తీసుకున్నప్పుడు సరి చూసుకున్నారా లేదా అన్నది తేల్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అంతేకాకుండా డిపార్ట్ మెంట్ లో సప్లై లేని 10/10 సైజ్ మాప్ ఆసుపత్రికి చేరడం వెనక కారణం ఏంటన్నది అంతు చిక్కకుండా పోతోంది. ఫస్ట్ టైం చెప్పినట్టుగా మాప్ సైజ్ ఎక్కువగా ఉన్న విషయమే కావచ్చు, రెండు నెలల్లో మాప్ డ్యామేజ్ కాకపోవడం కావచ్చు, రెండో నివేదికలో ఆమె చివరి ఆపరేషన్ జగిత్యాల ఆసుపత్రిలోనిదేనని గుర్తించడంతో అధికారులకు కొత్త చిక్కుముడి తెచ్చి పెట్టినట్టయింది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ముందు కొత్త సవాళ్లను ఉంచినట్టయింది. దీంతో జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో ఆరోజేం జరిగింది..? సీనియర్ రెసిడెన్స్ తో పాటు సీనియర్ డాక్టర్ల ప్రమేయం, థియేటర్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ వ్యవహారంతో పాటు శాఖాపరంగా సరపర చేయని ఆ సైజ్ మాప్ ఎలా ఉందన్న విషయాలే చుట్టే చర్చలు సాగుతున్నాయి.