చైనీయులను వెంటాడుతున్న కరోనా…
రెండేళ్లుగా అంతర్జాతీయ సమాజాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మరో సారి విజృంభిస్తోంది. వైరస్ పుట్టిన దేశమైన చైనా మళ్లీ కరోనాతో అల్లాడిపోతోంది. కరోనా వేవ్ మళ్లీ అటాక్ చేయడంతో చైనాలో మరణ మృదంగం సాగుతోంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు చైనీయులు నిమ్మకాయల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.
నిమ్మకాయలకు డిమాండ్
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో చైనాలో నిమ్మకాయలకు భారీ డిమాండ్ పలుకుతోందట. నిమ్మకాయలు కొనేందుకు చైనీయులు దుకాణాల ముందు చైనీయులు క్యూ కడుతున్న పరిస్థితి తయారైంది.
కరోనా వైరస్ కు పుట్టినట్టుగా చెప్తున్న చైనా వాసులు ఇప్పుడు రోగ నిరోధక శక్తి చాలా ఉన్న నిమ్మకాయలు కొనుగోలు చేస్తున్నారు. భారత్ లో చిట్కా వైద్యం చేసుకున్నట్టుగానే చైనా ప్రజలు ఇప్పుడు ఇంటి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఆ దేశంలో నిమ్మకాయల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయని సిచుయాన్ లోని అనియు కౌంటీ ప్రాంతానికి చెందిన ఓ రైతు చెప్పినట్టు బ్లూమ్ బర్గ్ లో ఓ కథనంలో ప్రచూరితం అయింది. వారం పది రోజుల క్రితం వరకు రోజుకు 5 నుండి 6 టన్నుల నిమ్మకాయలు విక్రయించేవాడినని, వారం నుండి 20 నుండి 30 టన్నుల వరకు అమ్ముడుపోతున్నాయని వివచారించారు. చైనా వ్యాప్తంగా కూడా విక్రయించే నిమ్మకాయల్లో 70 శాతం ఉత్పత్తి అనియూ కౌంటీ ఏరియాలోనే అవుతాయని కూడా అందులో పేర్కొన్నారు. విటమిన్ ‘సి’ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకున్నట్టయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సి విటమిన్ అందించే నిమ్మకాయలు తినడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా మరోసారి తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ముందస్తు ఆరోగ్య సూత్రాలు పాటించే పనిలో వారు నిమగ్నం కావడంతో ఇప్పుడు నిమ్మకాయలకు ఆ దేశంలో ఫుల్ డిమాండ్ వ్యక్తం అవుతోంది. నిమ్మకాయలే కాకుండా పియర్స్, పీచ్, నారింజ వంటి రకాల పండ్లకు కూడా డిమాండ్ భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది.
అధికారికంగా ఇద్దరే…
ఇటీవల కాలంలో చైనాలో కరోనా పెద్ద ఎత్తున విజృంభిస్తోందన్న ప్రచారం దావణంలా జరుగుతున్నా అక్కడి అధికార వర్గాలు మాత్రం గత నాలుగు నెలల్లో బీజింగ్ లో కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని ప్రకటించారు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం చైనాలో విలయతాండవం చేస్తున్న కరోనా కేసుల గురించి వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అక్కడి ప్రజల ఆందోళన నేపథ్యంలో మళ్లీ చైనా జీరో కోవిడ్ ఆంక్షలను సడలించినట్టుగా కూడా చెప్తున్నారు. రానున్న మూడు నాలుగు నెలల్లో 60 శాతం వరకు కోవిడ్ బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా చైనాలో పెరిగిపోయిన కోవిడ్ మరణాల గురించి పెద్ద ఎత్తున కథనాలు వస్తుండడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. వచ్చే వంద రోజుల్లో చైనాతో పాటు ప్రపంచం కూడా కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10 శాతం మంది కోవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారు. ఎరిక్ చేసిన ఓ ట్విట్ కూడా కోవిడ్ మరోసారి వెంటాడుతోందని స్పష్టం అవుతోంది. చైనాలో రోగులతో నిండిపోయిన ఈ వీడియోను కూడా ఈ ట్విట్ లో అప్ లోడ్ చేయడంతో చైనాలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారాయని స్పష్టం అవుతోంది. అంతేకాకుండా బీజింగ్‌లోనే ఇటీవల కాలంలో 2700 మంది వరకు చనిపోయినట్టు హాంకాంగ్ మీడియాలో కథనాలు వెలువడడం గమనార్హం. ఇక్కడి శ్మశానవాటికల్లో కొన్ని కోవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో వెల్లడించింది. సగటున రోజుకు 200 శవాలు వస్తున్నాయని ఓ శ్మశానవాటికలో పనిచేసే ఓ సిబ్బంది చెప్పారని ఆ కథనంలో పేర్కొంది.
ఆ లెక్కలు ఇలా…
అయితే చైనాలో ఇప్పటి వరకు కరోనా మరణాలు అతి తక్కువగా ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. చైనాలో ఇప్పటివరకు కేవలం 5,327 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారని చెప్తున్నాయి. అయితే అక్కడి అధికారులు తీసుకున్న ప్రామాణికత కూడా ఇందుకు కారణమని చెప్పక తప్పదు. కరోనా సోకి ఉన్నప్పుడు మరణించిన వారినే కోవిడ్ బారిన పడి చనిపోయారని గుర్తిస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా మాత్రం కరోనా వైరస్ సోకిన తర్వాత వచ్చే ప్రభావాలతో మృతిచెందినా కొవిడ్ మరణాలుగానే పరిగణిస్తున్నారు. దీంతో వివిధ దేశాల్లో కొవిడ్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా చైనాలో మాత్రం తక్కువగా ఉంటోందని సమాచారం. తాజాగా జీరో కొవిడ్ సడలింపుల తర్వాత లక్షణాలు లేని కోవిడ్ కేసులను బీజింగ్ అధికార యంత్రంగం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. లక్షణాలున్న వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించకుండా ఇళ్లలోనే ఉండాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.
అలెర్ట్ తప్పని సరి…
మళ్లీ చైనాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ లో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని తేటతెల్లం చేస్తోంది. ప్రజలే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత ఉంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లలో జరిగిన మరణాలను దృష్టిలో పెట్టుకుని భారతీయులు స్వీయ రక్షణ చర్యలు తీసుకునే పనిలో ఇప్పటి నుండే నిమగ్నం అయితే అన్ని విధాలుగా మంచిదని గత అనుభవాలు కూడా చెప్తున్నాయి. ప్రీ కాషన్స్ వంటి చర్యలు తీసుకుంటు జీవనం సాగిస్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.