అందరి చూపు అటువైపే…

తెలంగాణలో కీలకంగా మారిన పార్టీ

దిశ దశ, హైదరాబాద్:

తమ తమ పార్టీల నుండి టికెట్లు ఆశించి భంగపడ్డ ఆశావాహులు ప్రజా క్షేత్రంలో తమ సత్తా చాటేందుకు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో కూడా టికెట్ల కోసం చివరి క్షణం వరకూ ప్రయత్నించి నైరాశ్యంలో కూరుకపోయిన వారిలో కొంతమంది నాయకులు ఆ పార్టీవైపు అడుగులు వేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ సింబల్ పై నిలబడ్డ వారిలో కొంతమంది గెలుపును అందుకోవడం, మరికొంతమంది టఫ్ ఫైట్ ఇవ్వడంతో పార్టీ గుర్తు చాలా ప్రాంతాల ఓటర్లలో బలంగా నాటుకపోయింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పై బరిలో నిలిచినట్టయితే ప్రజల్లో ఆ పార్టీ గుర్తు సింహం గురించి ప్రజలకు సుపరిచతం అయి ఉన్నందున తమకు లాభిస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ పార్టీ టికెట్ పై పోటీ చేసేందుకు చాలా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఏఐఎఫ్ బి బిఫారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఏఐఎఫ్బీ పార్టీ ముఖ్య నాయకులతో రాష్ట్రంలోని 25 నుండి 30 స్థానాలకు చెందిన ఆశావాహులు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని నియోజకవర్గాలకు చెందిన టికెట్లను బ్లాక్ కూడా చేసుకున్నట్టుగా సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్, నుండి వరంగల్ జిల్లా వరకు కూడా సింహం గుర్తుపై చట్ట సభలకు, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు పోటి చేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫారంపై పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు ఈ పార్టీ సింబల్ పై బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.

మారనున్న తలరాతలు…

అయితే గతంలో ద్విముఖ పోరు ఉన్నప్పుడు సింహం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల, వారి ప్రత్యర్థుల గెలుపోటములు తేలిపోయాయి. కానీ ఈ సారి చాలా చోట్ల కూడా బహుముఖ పోరు తప్పదన్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏఐఎఫ్ బి పార్టీ అభ్యర్థుల పాత్ర అత్యంత కీలకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఈ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యర్థుల తల రాతలు మార్చే ప్రమాదం లేకపోలేదు. కొన్ని చోట్ల గెలిచే అవకాశాలు ఉండడంతో ఆయా స్థానాల నుండి పోటీ చేసేందుకు ఆశావాహులు రంగంలోకి దిగబోతున్నారు. అయితే పార్టీ సింబల్ ఓటర్లకు సుపరిచితం కావడం తమకు లాభించనుందని భావిస్తున్న అభ్యర్థులు సాధించుకునే ఓట్లు గెలిచే అభ్యర్థుల తలరాతలను మార్చే ప్రమాదం ఉంటుంది. రామగుండం, భూపాలపల్లి వంటి నియోజకవర్గాలలో అయితే సింహం గుర్తు అందరి నోటా నానిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం కేవలం ఆ నియోజకవర్గాలకే కాకుండా ఇరుగు పొరుగు నియోజకవర్గాలపై కూడా పడే అవకాశం ఉంటుంది. దీంతో ఈ గుర్తుపై పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ముఖ్య నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయ నాయకులకు ఈ పార్టీ ప్రత్యామ్నాయ షెల్టర్ గా మారిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page