అక్రమ రవాణాకు సరికొత్త దారి… ఏకంగా లారీ సైజులనే మారుస్తున్న ఘనులు

దిశ దశ, హైదరాబాద్:

సామర్థ్యానికి మంచి రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఓవర్ లోడ్ కోసం ఏకంగా లారీ సైజులనే మార్చేస్తున్నారు. ఆర్టీఏ నిబంధనలు తుంగలో తొక్కి మరీ లారీ బాడీ సైజులను పెంచేసుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ యాష్ ప్లాంటు, వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన రీచుల ద్వారా తరలించే ఇసుక విషయంలో ఈ లారీల సైజులు మార్చుతున్నట్టుగా స్పష్టం అవుతోంది.

బాడీ సైజ్…

రోడ్డు రవాణా సంస్థ నిబంధనల ప్రకారం టైర్లను బట్టి లారీ సామర్థ్యాన్ని నిర్దేశిస్తారు. లారీ బాడీ సైజు కూడా ఎంత ఉండాలోనన్న విషయం కూడా స్ఫష్టత ఉంటుంది. అయితే లారీలను ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చిన తరువాత వాటి సైజులను విస్తరించేందుకు తిరిగి షెడ్డులకు పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. వెనక భాగంలో కొంత మేర, పైకి కొంత మేర ఎక్స్ ట్రా సైజులను పెంచి రవాణా విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల కూడా ధర్మకాంటాలు ఏర్పాటు చేసి అక్కడ లోడింగ్ కు ముందు తర్వాత లారీని తూకం వేయించాల్సి ఉంటుంది. అయితే ఇసుక రీచులను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించిన అధికారులు వాటి వద్ద ప్రత్యేకంగా వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయలేదు. దీంతో లారీల్లో ఇసుక నింపేప్పుడు బాడీ లెవల్ అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నామని అధికారులు సర్ది చెప్తూ వచ్చారు. దీంతో బాడీ లెవల్ కన్న ఎక్కువ ఇసుక నింపే అవకాశం లేదని గమనించిన లారీ వాలాలు వాటి సైజులను పెద్దగా చేయించారు. దీంతో రవాణా చేసే లారీలను గమనిస్తే బాడీ సైజ్ ను మించి ఇసుక రవాణా కావడం లేదని స్పష్టం అవుతోంది. అయితే లారీల సైజులను పెంచి మరీ రవాణా చేస్తుండడం వల్ల నిబంధనలు అమలు కావడం లేదు.

సర్కారుకే కుచ్చుటోపీ…

అయితే లారీ బాడీ సైజులను పెంచుకుని రవాణా చేస్తుండడం వల్ల సర్కారుపైనే అదనపు భారం పడుతోంది. ఎన్టీపీసీ యాష్ ప్లాంటు నుండి ఖమ్మం జిల్లా మీదుగా నిర్మాణం అవుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు తరలిస్తున్న బూడిద ఓవర్ లోడ్ తో వెల్తున్నాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వినియోగిస్తున్న లారీల బాడీ సైజులను పెంచి బూడిద రవాణా చేస్తున్నట్టుగా విమర్శలు ఉన్నాయి. అలాగే ఇసుక తరలించే లారీలకు కూడా ఎక్స్ ట్రా బాడీ ఫిట్టింగ్ చేయించడంతో సామర్థ్యానికి మించి ఇసుక లోడ్ అవుతోంది. లారీల్లో అదనపు రవాణా చేస్తుండడం వల్ల రహదారుల ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది. ఓవర్ లోడ్ కారణంగా ప్రధాన రహదారులు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అయితే బాడీ లెవల్ అన్న వంకను చూపిస్తు అదనంగా బాడీ ఫిట్టింగ్ చేయించుకున్న లారీలపై కొరడా ఝులిపిస్తున్న సందర్భాలు నామ మాత్రమే అయ్యాయి. ఆర్టీఏ అధికారులు కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా చొరవ తీసుకోకపోవడంతో ఇలా లారీల బాడీలను అదనంగా పెంచుకుంటూ పోతున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇసుక లారీలు అయితే క్యూబిక్ మీటర్ కు ఇంత అని ముందుగానే డబ్బులు ఇచ్చి వేబిల్లు తీసుకుంటారు. అయితే వే బిల్లుల ద్వారా అనుమతి ఇచ్చేదానికంటే ఎక్కువ ఇసుకను లోడింగ్ చేస్తుండడంతో అటు టీఎస్ఎండీసీ ఆదాయానికి కూడా గండిపడుతుండగా, రీచుల నుండి మొదలు అవి గమ్యం చేరే వరకూ రోడ్లు విధ్వంసానికి గురువుతున్నాయి. దీంతో రోడ్ల రిపేర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. సాధారణ టన్నేజీతో లారీలు రాకపోకలు సాగిస్తే ఏండ్ల తరబడి కూడా రోడ్లు బావుంటాయి… కానీ ఓవర్ లోడ్ వల్ల జరుగుతున్న రవాణా వల్ల రోడ్ల అస్థిత్వం మూణ్ణళ్ల ముచ్చటే అవుతున్నది. ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ నుండి తరలి వెల్తున్న బూడిదకు గ్రీన్ ఫీల్డ్ హైవే టన్నేజీని బట్టి బిల్లు చెల్లిస్తున్నప్పటికీ… ఓవర్ లోడ్ వల్ల రోడ్లపై అదనపు భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెండు సంస్థలు ఓవర్ లోడ్ ను అధికారికంగా ఆమోదిస్తుండడం వల్ల కూడా నిబంధనలు అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీఏ అధికారులు దాడులు చేసినప్పుడు ఓవర్ లోడ్ విషయంలో టన్నుకు రూ. 1000 చొప్పున జరిమానా విధిస్తున్నామని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. అయితే లారీల బాడీ సైజులను విస్తరింపజేసి నిబంధనలు అతిక్రమించిన విషయాన్ని మాత్రం అధికారులు పట్టించుకోవం లేదు. కేవలం ఓవర్ లోడ్ విషయంలో అడపాదడపా చేస్తున్న దాడులు చేసి ఫైన్లు వేస్తున్నారు కానీ మిగతా అంశాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page