దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావాహుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు తెరపైకి వచ్చిన వారే కాకుండా మరికొంత మంది కూడా తమవంతు ప్రయత్నాల్లో మునిగిపోయినట్టుగా తెలుస్తోంది.
విముఖంగా ఆయన..?
అయితే కరీంనగర్ లోకసభ స్థానం నుండి పోటీ చేసే విషయంలో మొదట ప్రతిపాదనకు వచ్చిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. తనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలన్న ప్రతిపాదనను అధిష్టానం పెద్దల ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సామాజికవర్గాల కూర్పులో తప్పనిసరిగా పోటీ చేయాలంటే మాత్రం ప్రవీణ్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు లేకపోలేదు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాల్సి ఉన్నందున కరీంనగర్ స్థానాన్ని ఈ సారి ఈ ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధిష్టానం యోచిస్తున్నట్టుగా సమాచారం. ఒక వేళ అధిష్టానం అదే దిశగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రవీణ్ రెడ్డి పోటీ చేయక తప్పదని స్పష్టం అవుతోంది.
పావులు కదుపుతున్న ‘వెలిచాల’…
మరో వైపున సీనియర్ నేత వెలిచాల జగపతి రావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు తనకు టికెట్ కెటాయించాలన్న ప్రతిపాదనను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు ఉంచారు. ఈ మేరకు జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ‘వెలమ’ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావుకు అవకాశం కల్పించినట్టయితే వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందన్న వాదన కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో కరీంనగర్ అసెంబ్లీ, లోకసభ స్థానాల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన వారే ప్రాతినిథ్యం వహించే వారని అయితే క్రమక్రంగా ప్రాధాన్యత తగ్గిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నరు. సామాజిక వర్గ పరంగానే కాకుండా వెలిచాల కుటుంబంతో బీసీ సామాజిక వర్గాల్లో కూడా గట్టి పట్టు ఉన్నందున అవకాశం కల్పిస్తే బావుంటుందని అంటున్నారు. ఇదే క్రమంలో రాజేందర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.
‘పురుమళ్ళ’ ఎంట్రీ…
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ కూడా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అవకాశం ఇవ్వాలని కోరుతున్న పురుమళ్ల ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నాయకులను కూడా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది.
దుద్దిళ్ల శ్రీను బాబు …
ఇకపోతే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీను బాబు పేరు ఇప్పటికే అధిష్టానం వద్ద ప్రతిపాదనకు వచ్చిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పరిచయాలు ఉండడంతో పటు అన్న శ్రీధర్ బాబు బలం తనకు కలిసి వస్తుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని శ్రీను బాబు చెప్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ‘బ్రాహ్మణ’ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎంపీగా తెలంగాణలో అవకాశం ఇచ్చే పరిస్థితులు లేకపోవడం, బలమైన అభ్యర్థులు కూడా ఇతర నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో శ్రీను బాబుకు ఇస్తే అన్ని విధాల శ్రేయస్కరం అన్న వాదనలు తీసుకొస్తున్నారు.
ప్రియాంక గాంధీతో టచ్ లోకి…
మరో వైపున ఎన్ఆర్ఐలు కూడా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి సుమన న్యూయార్క్ లో స్థిరపడ్డారు. న్యూబెర్గర్ బెర్మన్ సంస్థలో వైస్ ప్రసిడెంట్ గా పనిచేస్తున్న సుమన ఇప్పటికే ప్రియాంకా గాంధీతో ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. విదేశాల్లో స్థిరపడిన తమలాంటి ఔత్సాహికులకు అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. దరఖాస్తు చేసుకుంటే ఏఐసీసీ పరిశీలిస్తుందని ప్రియాంకా గాంధీ సుమనకు చెప్పినట్టుగా తెలుస్తోంది.