గ్యాలెంటరీ అవార్డుకు ఎంపికైన ‘జూమ్’

మరణానంతరం కేంద్రం ప్రకటన

ఆర్మీలో విశేష సేవలందించిన ‘జూమ్’కు అత్యంత అరుదైన అవార్డు వరించింది. మరణానంతరం ఈ అవార్డుకు ఎంపిక అయినప్పటికీ జూమ్ అందించిన సేవలు మాత్రం చరిత్రలో సువర్ణక్షరాధ్యాయంగా మిగిలిపోయింది. అలుపెరగని పోరాటం చేసిన జూమ్ శరీరంలోకి తూటాలు చొచ్చుకపోయిన వెనక్కి తగ్గకుండా ఇద్దరు ఉగ్రవాదులను హతం చేయడంలో అత్యంత సాహసాన్ని కనబర్చింది. భారత సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచి రక్షణ వ్యవస్థలో కీలక భూమిక పోషించిన ‘జూమ్’కు కేంద్ర ప్రభుత్వం గ్యాలెంటరీ అవార్డుకు ఎంపిక చేయగం విశేషం.

ఇంతకీ జూమ్..?

ఇండియన్ ఆర్మీ డాగ్ యూనిట్ 28కి చెందిన జూమ్ బెల్జియం షెపర్డ్ జాతికి చెందిన శునకం. ఈ ఆర్మీ జాగిలం అందించిన సేవలు అత్యంత సాహసోపేతమైనవని గుర్తించిన కేంద్రం గ్యాలెంటరీ అవార్డుకు ఎంపిక చేసింది. ఉగ్ర మూకల దాడిలో బుల్లెట్లు శరీరంలోకి దూసకపోయినా వెరవకూండా ఎదురు దాడికి పూనుకుని ఇద్దరు టెర్రరిస్టులను హతం చేసింది. అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఆపరేషన్ టాంగ్ పావాలో గాయాలపాలైన జూమ్ కు ప్రత్యేక వైద్య సేవలందించారు. చికిత్స పొందిన జూమ్ గత అక్టోబర్ 13న చనిపోయింది. కేవలం రెండేళ్ల వయసులోనే దేశ రక్షణలో విశేష సేవలందించిన జూమ్ టెర్రరిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడడంతో 54 అడ్వాన్స్ ఫీల్డ్ వెటర్నరీ హాస్పిటల్ (AFVH)లో వైద్య సేవలందుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఆపరేషన్ జరిగిందిలా…

గత సంవత్సరం అక్టోబర్ 9న జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా టాంగ్ పావా ప్రాంతంలో టెర్రరిస్టులు ఓ ఇంట్లో షెల్టర్ తీసుకున్నారని బలగాలకు సమాచారం అందింది. వారి వద్ద మరణాయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయన్న విషయం కూడా తెలుసుకున్న ఆర్మీ బలగాలు ఈ ఆపరేషన్ లో ‘జూమ్’ సేవలు అందుకోవాలని నిర్ణయించాయి. ఆర్మీ బలగాల చేతిలో పరిపూర్ణమైన శిక్షణ పొందిన జూమ్ టెర్రరిస్టులు షెల్టర్ తీసుకున్న ఇంట్లోకి పంపించారు. ఇంట్లో ఉన్న టెర్రరిస్టులతో యుద్దానికి కలబడుతున్న జూమ్ పై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో దాని శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. అయినప్పటికీ వారితో పోరాటం చేసి ఉగ్రవాదులను అచేతనులుగా మార్చడంతో ఆర్మీ బలగాలు ఇంటిని చుట్టుముట్టి టెర్రరిస్టులను మట్టుబెట్టగలిగాయి. ఓ వైపున జూమ్ తో పోరాటం చేస్తూనే ఉగ్రవాదులు ఆర్మీ బలగాలపై కూడా గ్రైనేడ్ విసరడంతో ఈ ఘటనలో్ ఓ జవాను కూడా గాయాలపాలయ్యాడు. బెల్జియం షెఫర్డ్ జాతికి చెందిన జూమ్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో అందించిన సేవలకు గాను మరణానంతరం గ్యాలెంటరీ అవార్డును ప్రకటించడం విశేషం. జనవరి 25 2023న కేంద్రం విడుదల చేసిన జాబితాలో జూమ్ కు కూడా అవార్డు ఇస్తున్నట్టు వెల్లడైంది.

You cannot copy content of this page