చీకోటి ప్రవీణ్ అరెస్ట్ నెట్టింట వైరల్
చీకోటి ప్రవీణ్ మరో సారి వార్తల్లోకెక్కారు. ఈడీ దాడుల నేపథ్యంలో సంచలనాలకు కేరాఫ్ గా ఉన్న చీకోటి ప్రవీణ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి అంశాల్లో వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా గేమింగ్ యాక్టులో పటాయాలో థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త గుప్పుమంది. పటాయాలో 80 మంది భారతీయ జూదగాళ్లను థాయ్ పోలీసులు అరెస్ట్ చేయగా వీరిలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డిలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో 14 మంది మహిళలు కూడా ఉన్నారని…వీరంతా పటాయాలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో గ్యాంబ్లింగ్ నడిపిస్తున్న సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు దాడులు చేసి వీరందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. బ్యాంగ్ లాముంగ్ జిల్లాలోని టాంబోన్ నాంగ్ పూలోని సోయిఫ్రా తమ్నాక్ 4లోని ఆసియా పటాయా హోటల్ లో భారతీయులు పెద్ద ఎత్తున గదులు అద్దెకు తీసుకుని ఉన్నారని, ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు అద్దెకు గదులు తీసుకోగా ఈ హోటల్ లోని సంపోవా అనే కాన్ఫరెన్స్ హాల్ ను అద్దెకు తీసుకుని జూదం నిర్వహిస్తున్న విషయాన్ని థాయ్ పోలీసులు గుర్తించి ఆదివారం అర్థరాత్రి దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. జూదగాళ్ల నుండి వంద కోట్ల వరకూ డబ్బు దొరికిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డిటెక్టివ్ ఇన్ఫో…
భారతీయులు పెద్ద సంఖ్యలో గదులు అద్దెకు తీసుకున్న హోటల్ లో జూదం నడుస్తోందన్న సమాచారం డిటెక్టివ్ బృందాలు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బౌద్దిజాన్ని అవలంబించే థాయిల్యాండ్ లో జూదం ఆడడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. జూదం అతి పెద్ద క్రైంగా అక్కడి దేశం భావిస్తుంది. ఈ క్రమంలో గ్యాంబ్లింగ్ లోనే భారతీయులు పెద్ద సంఖ్యలో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
మరి కొన్ని గంటల్లో…
మరోవైపున సోమవారం ఉదయం పటాయా హోటల్ లో ఉన్న భారతీయులంతా కూడా సోమవారం స్వదేశానికి తిరిగి రావల్సి ఉంది. మే1న వీరంతా కూడా తిరుగు ప్రయాణం కావల్సి ఉన్న నేపథ్యంలో థాయ్ పోలీసులు ముప్పేట దాడి చేసి జూదగాళ్లను పట్టుకోవడం గమనార్హం. థాయ్ పోలీసుల అదుపులో భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు హైదరాబాద్ కు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ గ్యాంబ్లింగ్ గేమ్ ఆడించేందుకు థాయికి చెందిన మహిళలు కూడా సహకారం అందించినట్టుగా ప్రచారం జరుగుతోంది. థాయి పోలీసులు స్వాధీనం చేసకున్న వాటిల్లో రూ. 21 కోట్ల విలువ చేసే గేమింగ్ చిప్స్, 8 సీసీ కెమెరాలు, 90కి పైగా మొబైల్ ఫోన్స్, మూడు నోట్ బుక్స్ ను పోలీసులు సీజ్ చేసినట్టుగా సమాచారం.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post