దిశ దశ, జాతీయం:
ఇస్రో మరో అరుదైన ఘనతను సాధించింది. భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం సఫలం కావడంతో సౌర తుపానులను ముందుగానే గుర్తించడం వల్ల శాటిలైట్లు, పవర్ గ్రిడ్స్ ను కాపాడుకునే అవకాశం లభించింది.
ఆదిత్య ఎల్ 1
గత సంవత్సరం సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్ 1ను నింగిలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపించారు. 127 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆదిత్య ఎల్ 1 మొత్తంగా 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్ వద్ద హాలో కక్ష్యలోకి శనివారం 4 గంటల ప్రాంతంలో చేరింది. ఐదేళ్ల పాటు సేవలందించనున్న ఆదిత్య ఎల్ 1 సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ సౌర జ్వాలలపై అధ్యయనం చేస్తుందని ప్రాజెక్ట్ డైరక్టర్ నిగర్ షాజీ తెలిపారు. సూర్యుడికి దూరంగా ఉంటూ దానిపై ఏర్పడే సౌర విద్యుత్ అయస్కాంత ప్రభావాలను గుర్తించి హెచ్చరించనుంది. భారత ఉప గ్రహాలకు, కమ్యూనికేషన్ కు నష్టం వాటిల్లకుండా ఉండే విధంగా, సౌర తుపానులు దాటి పోయే వరకూ కూడా అప్రమత్తం చేస్తుంది. దేశంలో రూ. 50 వేల కోట్ల ఆస్తులు ఉండడంతో పాటు 50కి పైగా శాటిలైట్స్ పనిచేస్తున్నాయని ఆదిత్య ఎల్ 1 అలెర్ట్ చేసినప్పుడల్లా వాటిని కాపాడుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సౌర తుపాన్ల నుండి వెలువడే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి.