దిశ దశ, హైదరాబాద్:
ఈ నెల 26 నుండి లాంఛనంగా ప్రారంభించనున్న పలు సంక్షేమ పథకాలలో నిరుపేద కూలీలకు బాసటగా నిలిచే స్కీం ‘‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’. ఈ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కూడా తయారు చేసింది. ఏడాదికి రూ. 12 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించిన ఈ పథకం పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ నేతృత్వంలో అమలు చేయనున్నారు. GO.R.T NO: 42 విడుదల చేసిన ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను కూడా వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమిలేక, వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయనుంది.
ఎవరికి ఈ పథకం వర్తిస్తుందంటే..?
“ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకంలో భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి సంవత్సరానికి రూ.12,000/- (రూ. పన్నెండు వేలు) చొప్పున ఆర్థిక సహాయం అందివ్వనున్న ఈ పథకం జనవరి 26 నుండి అమల్లోకి రానుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకుని ఉండాలి. 2023-24 ఆర్థిక సంవత్సరం లో కనీసం 20 రోజులు ఈ స్కీం ద్వారా కూలీ పని చేసి ఉండాలి. భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు చెందిన వారు మాత్రమే “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకానికి అర్హులు. ఒక్కో కుటుంబానికి రెండు విడుతలుగా, రూ.6000/- చొప్పున సంవత్సరానికి రూ.12,000 ఆర్దిక సహాయం అందిస్తుంది. DBT పద్ధతిలో నిధులు వ్యవసాయ కూలీ కుటుంబ యజమాని ఖాతాకు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో కమిషనర్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ విభాగంగా పని చేస్తుంది. జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు మరియు ఫిర్యాదులను పర్యవేక్షించాల్సి ఉంటుంది.