తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు రైతుల నిరవధిక నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సమస్య పరిష్కారం కోసం ఉభయ రాష్ట్రాలు చొరవ తీసుకునే వరకూ ఆందోళనలు యథావిధిగా కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించి రైతులు వినూత్న ఆందోళనలతో తమ బాధలు వెల్లగక్కుతున్నారు. మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాలోని 12 గ్రామాలు మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురవుతున్నాయి. అయితే మొదటి విడతలో భూ సేకరణ జరిపేందుకు నిర్ణయించిన భూమిని పూర్తిగా సేకరించలేదని, ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా భూములు ముంపునకు గురవుతున్నాయని మహారాష్ట్ర రైతులు చెప్తున్నారు. ఈ నేఫథ్యంలో తమ గోడు పట్టించుకోవాలని సిరొంచ తాలుకా రైతులు నాలుగేళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయింది. గడ్చిరోలి జిల్లా అధికారులు ఎదో విషయాన్ని చెప్పడం కాలయాపన చేస్తుండడంతో తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయరైందని సిరొంచ రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి రైతులకు పరిహారం చెల్లించే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఇప్పుడు అదికారులు ఎకరాకు రూ. 3 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని చెప్తుండడంతో తామేం చేయాలో పాలుపోని పరిస్థితి తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట భూ సేకరణ జరిపినప్పుడు ఎకరాకు రూ. 10.50 లక్షలు ఇచ్చిన అధికారులు ఇప్పుడు రూ. 3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందామని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ధర చెల్లించాలని తమ రైతులు కోరుతున్నారంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఎలాంటి స్పందన రావడం లేదని ‘మహా’ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని సిరొంచ రైతుల పలుమార్లు హెచ్చరించిన నిరవధిక నిరసనలు చేపడతామని అక్కడి అధికారులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. అయితే మొదట అధికారులు ఆందోలన వాయిదా వేసుకోవాలని చెప్పడంతో సిరొంచ రైతులు నిరసనను నిలిపివేశారు. తిరిగి ఈ నెల 7 నుండి నిరసన చెప్తామని ముందుగానే లేఖ ఇచ్చినప్పటికీ పోలీసులు ఒక రోజు ముందు 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్డు అమల్లో ఉందని జనం గుమిగూడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బాధిత రైతుల వ్యూహం..
అయితే బాదిత రైతులు కూడా అక్కడి అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. నలుగురికంటే ఎక్కువగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినందున రోజుకు నలుగురి చొప్పన నిరసనలు చేపట్టడం మొదలు పెట్టారు. నిరసనల చెప్తున్నది నలుగురే అయినప్పటికీ పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున నిరసన చెప్పడం ఆరంభించారు. గురువారం స్థానిక రైతులు మహిళలు, చిన్నారులతో నిరసన కార్యక్రమం చేయించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ట్విట్ చేస్తూ స్కూలుకు వెల్లాల్సిన చిన్నారులు కూడా తమకు జరిగిన నష్టాన్ని పూడ్చి పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసన చేపట్టారని ఇకనైనా తమను ఆదుకోవాలని కోరారు. రోజుకో రీతిలో వినూత్నంగా నిరసనలు చెప్తున్న మహా రైతులు మాత్రం పోరుబాట విషయంలో వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేస్తున్నారు.