విచారణకు డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్తలు
దిశ దశ, కరీంనగర్:
బుధవారం అర్థరాత్రి కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక యూనివర్శిటీ ముందు నిరసన తెలిపిన వీరు రాష్ట్ర గవర్నర్ సహా పలువురికి ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్తలు కోట శ్యాంకుమార్, బెల్లపు కరుణాకర్ ల చేస్తున్న ఆరోపణల ప్రకారం… ఈ నెల 3న అర్థరాత్రి మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ మల్లేష్ సంకషాల విశ్వవిద్యాలయ అతిథి గృహంలో బస చేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎం వరప్రసాద్, ఫైనాన్స్ ఆఫీసర్ ఎం రవీందర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎన్వీ శ్రీరంగ ప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి ప్రసాద్ లు కలిసి 2022-23 ఆడిట్ సందర్భంగా వచ్చిన ఆబ్జెక్షన్ల మీద, స్టేట్ ఆడిట్ అధికారులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఫైళ్లను మార్పులు చేర్పులు చేశారు. అనధికారికంగా ఇలా వ్యవహరించడం సరికాదని ఈ తప్పుడు చర్యలకు పూనుకున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోట శ్యాం కుమార్, బెల్లపు కరుణాకర్ కోరారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఒక రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 2016లో ఆడిట్ ఆఫీసర్ గా తాత్కాలిక పోస్టింగ్ పొందారని, 2018లో డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్ గా తప్పుదోవ పట్టించి, అక్రమంగా ఫైనాన్స్ ఆఫీసర్ హోదాలో నియమించారని ఆరోపించారు. ఆ తర్వాత తన వ్యక్తిగత కారణాలు సాకుగా చూపించి 2019లో రాజీనామా చేశారని, తిరిగి 2021లో మాజీ విసి సంకషాల మల్లేష్, మాజీ ఓఎస్డి వన్నాల రమేష్ ల సహాకారంతో మళ్లీ అపాయింట్ అయ్యారన్నారు. 2022-23 ఆడిట్ నివేదికలో వెల్లడైన ఆబ్జెక్షన్లను పరిశీలించి, వెంటనే విచారణ చేపట్టి దోషులను శిక్షించి, నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుండి జవాబు పత్రాలు విశ్వవిద్యాలయం నుండి బయటకి తరలించి ఆన్సర్లతో కూడిన షీట్లను తిరిగి కార్యాలయాయినిక చేర్చుతున్నారన్నారు. ఇదంతా కూడా కంట్రోలర్ శ్రీరంగ ప్రసాద్ అండదండలతోనే జరుగుతున్నాయని, జులై 1 నుండి 08.వరకు ఎగ్జామినేషన్ బ్రాంచ్ లోని సీసీ పుటేజీ పరిశీలించి దోషులను శిక్షించాలన్నార. 2021లో శ్రీరంగ ప్రసాద్ కంట్రోలర్ గా పరీక్ష పత్రాల లీకేజీ అంశం మీద కేసు వేసి చేతులు దులుపుకున్నారని, అప్పుడు పరీక్ష పత్రాల లీకేజీ అనంతరం పరీక్షలను వాయిదా వేసి తిరిగి నిర్వహించకుండా, కావాలనే వాటిని కొనసాగించారని విమర్శించారు. 2021-22, 2022-23, 2023-24 లో పరీక్ష పత్రాల స్కానింగ్ డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టడానికి మాజీ విసి ప్రొఫెసర్ మల్లేష్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీరంగ ప్రసాద్ లు టెండర్ కు పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో కోసిన్ లిమిటెడ్ అనే సంస్థకు కోట్ల రూపాయల పనులను అప్పజెప్పారని కోట శ్యాం కుమార్, బెల్లపు కరుణాకర్ లు ఆరోపించారు. విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో టెండర్లకు పిలిచినప్పటికి అర్హత ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో తిరిగి గతంలో నామినేషన్ పద్దతిలో ఇచ్చిన సంస్థకే డిజిటలైజేషన్ బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. విశ్వవిద్యాలయ నిధుల అవకతవకలపై, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని, దారి మల్లిన నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.