ముగ్గురు అధికారుల విచారణ నేడు
దిశ దశ, జగిత్యాల:
ధర్మాసుపత్రిలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపున విస్తృత ప్రచారం చేస్తుంటే… అక్కడ మాత్రం అధర్మబద్దంగా పనిచేస్తూ అందరితో చీవాట్లు పడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు వెల్లువెత్తిన చేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మరోసారి జగిత్యాల ఆసుపత్రి చర్చల్లో నిలిచింది.
ఏడాదిన్నర క్రితం…
దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ బాలింత పురిటి నొప్పులతో 2021 డిసెంబర్ 29న జగిత్యాల పెద్దాసుపత్రిలో ప్రసూతి అయ్యారు. సిజేరియన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో కర్చీప్ మర్చిపోవడంతో తరుచూ నొప్పులతో బాధపడుతున్న ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ విషయంపై లోతుగా ఆరా తీయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపరేషన్ చేసిన రోజున జగిత్యాల ఆసుపత్రిలో పీజీ కంప్లీట్ అయి ప్రాక్టికల్ ట్రైనింగ్ అవుతున్న సీనియర్ రెసిడెన్స్(ఎస్ఆర్) డ్యూటీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ థియేటర్ డ్యూటీలో ఫిమేల్ స్టాఫ్ నర్స్ లేకపోవడంతో మేల్ స్టాఫ్ నర్స్ డ్యూటీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి ఆపరేషన్లు జరిగిన తరువాత థియేటర్ వద్ద డ్యూటిలో ఉండే స్టాఫ్ నర్సులు డెలివరీ టైంకు ముందు ఎన్ని కర్చీప్ లు ఇచ్చారు, ఏఏ మెటిరియల్ అక్కడ ఉంచారు తదితర విషయాలన్ని రికార్డు చేసుకుని, ఆపరేషన్ తరువాత లెక్క సరిచూసుకోవల్సి ఉంటుంది.
నిర్లక్ష్యమేనా…?
ప్రధానంగా సీనియర్ రెసిడెన్స్ (ఎస్ఆర్)కు బాధ్యతలు అప్పగించినప్పుడు వారి వెంట ఖచ్చితంగా సీనియర్ వైద్యులు ఉండి పర్యవేక్షణ చేస్తూ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిసింది. అయితే 2021 డిసెంబర్ 29న జరిగిన ఆపరేషన్ సమయంలో కేవలం ఎస్ఆర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని, సీనియర్ డాక్టర్ లేరని సమాచారం. అంతేకాకుండా మేల్ స్టాఫ్ నర్సు ఆపరేషన్ తరువాత కర్చీప్ లు, ఇతరాత్ర మెటిరియల్ సరి చూసుకోకపోవడం వల్లే ఆమె కడుపున కర్చీప్ ఉన్న విషయాన్ని సకాలంలో గుర్తించలేకపోయారని తెలుస్తోంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే డ్యూటీ దిగిపోయిన తరువాత మేల్ స్టాఫ్ నర్సు నుండి బాధ్యతలు తీసుకున్న మరో నర్సు కూడా కర్చీప్ తో పాటు ఇతరాత్ర ఆపరేషన్ థియేటర్ మెటిరియల్ ను లెక్క చూసుకోనట్టు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా ఏడాదిన్నర కాలంగా ఓ కర్చీప్ మిస్సయిన విషయాన్నే ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
నేడే విచారణ
ముగ్గురు అధికారుల బృందం ఈ ఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో డిఎంహెచ్ఓ శ్రీధర్, ఆసుపత్రి సూపరింటిండెంట్ రాములు, గైనిక్ వింగ్ హెచ్ఓడి అరుణలు ఆసుపత్రిని పరిశీలించి వాస్తవాలను వెలికి తీయనున్నారు. బుధవారం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి చేరుకుని రికార్డులు పరిశీలించి డ్యూటీలో ఉన్న వారి నుండి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈ నివేదికను వైద్య విధానపరిషత్ ఉన్నతాధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు పంపించనున్నారు.