కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టుకు తెలపకుండా మాస్టర్ ప్లాన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ వాదనల సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టామని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని నిలిపివేశామని చెప్పింది. ఈ క్రమంలోనే స్పందించిన ధర్మాసనం.. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి సంబంధించి సింగిల్ బెంచ్‌లో ఉన్న మరో పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌లో ఇంప్లీడ్ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించి గత విచారణలో కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ.. మాస్టర్ ప్లాన్ కారణంగా ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ ఉన్న దాదాపు 2,000 మంది సన్నకారు రైతులు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని కేఏ పాల్ తెలిపారు. వారి అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలను ప్రతిపక్షాలు సైతం మద్దతుగా నిలిచాయి. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మున్సిపల్‌ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి ముసాయిదాను రద్దు చేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని కౌన్సిలర్లంతా ఆమోదించారు.

You cannot copy content of this page