కరీంనగర్ డీ మార్ట్ లో లీగల్ మెట్రాలాజీ అధికారులు సోదాలు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ బ్యాంకు కాలనీలోని డిమార్ట్ లో లీగల్ మెట్రాలాజీ విభాగం అధికారులు సోదాలు చేపట్టారు. రెండు రోజులుగా కరీంనగర్ డిమార్ట్ లో వినియోగదారుల నిలువుదోపిడీపై ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులకు కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో డిమార్డ్ షోరూంలో బుధవారం ఉదయం లీగల్ మెట్రాలాజి విభాగం అధికారుల బృందాలు తనిఖీలు చేపడుతోంది. వినియోగదారుల ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు జరుగుతుండడం విశేషం.

భాధితుల ఆరోపణలు…

అయితే డిమార్ట్ లో జరుగుతున్న వ్యవహారంపై ఆగ్రహించిన కన్జ్యూమర్లు షోరూం వద్దకు వెల్లి నిరసన తెలిపారు. వారు కొనుగోలు చేసిన వస్తువుల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకుని అవి ఎక్కువగా కొన్నట్టుగా బిల్లులు వేస్తు తమను నిలువు దోపిడీ చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ రకాల సామాగ్రి కొనుగోలు చేసిన వినియోగదారులకు ఇలా బిల్లులు వసూలు చేసి ఎక్కువ డబ్బులు పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వినియోగదారులతో కిక్కిరిసిపోయే కార్పోరేట్ షోరూంలలో వస్తువులు కొనుగోలు చేసిన తరువాత క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇంటికి వెల్లి చూసుకుంటున్న కన్జ్యూమర్లు తాము కొనుగోలు చేసిన వస్తువులకన్నా ఎక్కువ బిల్లు చెల్లించామని గుర్తిస్తున్నారు. అయితే తమ షోరూం నుండి బయటకు వెల్లిపోయిన తరువాత చెక్ చేసుకుంటే సంస్థకు సంబంధం లేదంటూ డిమార్ట్ ఉద్యోగులు తేల్చి చెప్పిన సందర్భాలు కూాడ ఉండడంతో సామాన్యులు వారిని నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది. కరీంనగర్ కు చెందిన వినియోగదారుడు వీడియో తీసి మరీ వైరల్ చేయడంతో కార్పోరేట్ దుకాణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఆఫర్ల ఎర…

ఆఫర్లు ఎరగా వేస్తూ… వినియోగదారులను ఆకర్షిస్తూ బిల్లులు వేసే సమయంలో మాయాజాలం సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్యాకింగ్ చేసిన వస్తువుల్లో తూకం కూడా తక్కువ ఉంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ కార్పోరేట్ సంస్థ కాబట్టి సామాన్యుడు మిన్నకుండి పోతున్నాడు. వీటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన విభాగాలు తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు తప్ప స్పందించడం లేదు. దీంతో ఇలాంటి బడా వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని వినియోగదారులు అంటున్నారు.

You cannot copy content of this page