ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ సంస్థలు చాలా వరకూ ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డాయి. సంస్థలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఎంప్లాయిస్ ను తొలగించేేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కంపెనీలపై పడుతున్న అదనపు భారం నుండి బయట పడేందుకు .. ‘లే ఆఫ్’ ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, Amazon , Google , Twitter , Swiggy , ఫిలిప్స్, OLX వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. అయితే ఆ కంపెనీలకు భిన్నంగా ఇంటెల్ సంస్థ మాత్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తమ సంస్థపై నమ్మకం పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించి కష్టాల పాలు చేయకూడదని భావించి కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించకుండా.. వారికి చెల్లించే వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. దీనివల్ల సంస్థపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఉద్యోగులను కూడా కాపాడుకున్నట్టు అవుతుందని సంస్థ భావిస్తోంది.
ఇంటెల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులందరూ .. తమ జాబ్స్ తొలగించనందుకు ఆనందంగా ఉన్నారు . ఇంటెల్ కంపెనీ CEO , ఎగ్జిక్యూటివ్ స్థాయి నుండి.. కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ షరతు వర్తిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు . ఇంటెల్ CEO పాట్ గెల్ సింగర్‌కు 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, జూనియర్ మేనేజర్లకు 5 శాతం వేతనాల్లో కోత విధించనున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని.. ఉద్యోగుల గురించి కూడా ఆలోచన చేసి ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నామని ‘ ఇంటెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంటెల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి.. కానీ మా కంపెనీ పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించలేదు.. ఆ విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నామని “ఇంటెల్ కంపెనీలో పని చేసే ఉద్యోగులు అంటున్నారు.