గోదావరి తీరంలో మేథస్సుల పంట

బడిలో విరబూస్తున్న జ్ఞాన సంపద

అక్కున చేర్చుకుని సృశిస్తే చాలు వెలికి వస్తోందక్కడి జ్ఞాన సంపద. గోదావరి నదిలో పరవళ్లతో పోటీ పడుతోందక్కడి చిన్నారుల మేథస్సు. సర్కారు బడిలో చదువుతూ మిరాకిల్స్ క్రియేట్ చేస్తున్నారు వారంతా. అంతర్జాతీయ నిఘా వర్గాలకూ అంతుచిక్కని వాటిని అలవోకగా పరిష్కరించే మార్గాన్ని కనుగొన్నారక్కడ. ఇంటింటికి ఇన్నోవేటివ్ కాదు… ఇన్నోవేషన్ థింకింగ్స్ కే మా స్కూలు అడ్డా అంటున్నారా స్టూడెంట్స్… వజ్రాల్లాంటి విద్యార్థుల్లో దాగిన జ్ఞాన సంపద గమనిస్తే చాలు అద్భుతాలు… కాదు… కాదు… అత్యద్భుతాలూ సృష్టించొచ్చంటున్నారా మాస్టారు. అపరజ్ఞాని పీవి నడియాడిన ఆ నేలన వజ్రపు తునకలై మెరుస్తున్నాయి. ఆయన ప్రారంభించిన ఆ పాఠశాల వైపు భారత్ అంతా చూసేలా తమలోని జిజ్ఞాసను ప్రదర్శిస్తున్నాయా మేథస్సులు. దేశం గర్వించే స్థాయికి చేరిన ఆ చిన్నారులెవరు..? ఎక్కడి వారు..? వారిలోని క్రియేటివిటీ ఏంటో తెలుసుకోండిలా.

ఎక్కడి వారంటే…?

దశాబ్దాల క్రితం మారుమూల ప్రాంతంగా పేరొందిన కరీంనగర్ జిల్లా తూర్పు అటవీ ప్రాంతంలో నెలకొన్న అపారమైన మేథస్సుకు మెరుగులు దిద్దే ప్రక్రియ ప్రారంభం అయింది. దీంతో పరివాహక ప్రాంత సిగలో నగలుగా ఎదిగిపోయి ఒదిగిపోతున్నారక్కడి చిన్నారులు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్ ఆలోచనల సంఘర్షణలతో నూతన ఆవిష్కరణలకు వేదికగా మారిపోయింది. మా‘స్టారూ’ మడ్క మధు సార్ ఇస్తున్న స్పూర్తిని అందుకుని ముందుకు సాగుతున్న చిన్నారులు అపర మేథావులుగా మట్టిలో మాణిక్యాలుగా వెలికితీయబడుతున్నారు. ఒకప్పుడు అన్నల ఇలాకాగా ముద్ర పడ్డ మహదేవపూర్ నేడు అద్భుతాలు సృష్టించే అడ్డాగా మారిపోయింది. మధు సార్… ప్రోత్సాహం మీవంతయితే ఈ దేశానికే వన్నెతెచ్చి తీరుతామంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారా విద్యార్థులు.

గ్రూప్ డిస్కషన్స్…

మారుమూల పాత తాలుకా కేంద్రంలోని ఆ పాఠాశాల భవనం అస్థిత్వంలో కొట్టుమిట్టాడుతున్నా వారిలోని మేథా శక్తిని వెలికితీసేందుకు గ్రూప్ డిస్కషన్ తో ప్రారంభం అయిన ఆ ప్రస్థానం నేడో రేపో ప్రధాని మోడీ ముందు ప్రదర్శనకు సిద్దం కాబోతోంది. శిథిలమవుతున్న తరగతి గదుల్లోనే ఆలోచనలకు పదును పెట్టి మరీ తమ సత్తా ఏంటో చాటుతున్నారా విద్యార్థులు. సైన్స్ ల్యాబ్ ఉన్న కాలంలోనూ సైన్స్ ఫెయిర్ గురించి తెలియని నాటి కాలానికి సైన్స్ ఫెయిర్ లోనే ఆ పాఠశాలకు వన్నె తెస్తున్న నేటి తరానికి ఉన్న తేడా సాక్షాత్కరిస్తోందక్కడ. సాగర మథనంలో అమృతం వెలికి తీశారన్నది చరిత అయితే… సుదీర్ఘమైన చర్చలతో అపారమైన మేథాస్సును వెలికి తీయవచ్చన్నది నిజమని నిరూపించారు.

క్రియేటివిటీ ఇది…

నిఘా కళ్లు గప్పి వైట్ కాలర్ నేరాలకు పాల్పడడం… దేశ విచ్ఛిన్నకర శక్తులుగా మారిన వారి చర్యతో అట్టుడికిపోయే పరిస్థితులకు ఇక చెక్ అంటున్నారా విద్యార్థులు. సాంకేతికత మీవంతయితే సైగలతో జరిగే చర్యలు ఏంటో ఇట్టే పసిగట్టేస్తామంటున్నారా చిన్నారులు. తమలోని ఆలోచనలను అలవోకగా ఆచరణలో పెట్టేసి వినూత్న ఆవిష్కరణలు చేస్తూ ఆదర్శప్రాయంగా నిలిచారు మహదేవపూర్ హైస్కూల్ విద్యార్థులు. ఐ కోడింగ్ డీకోడ్ చేసే ప్రక్రియతో మొదలై ఇప్పుడు లీప్ రీడింగ్ ను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారా స్టూడెంట్స్. మొదట కను సైగలతో నేరస్థులు ఎలా వ్యవహరిస్తారు..? నిఘా కళ్లుగప్పి తప్పించుకునేందుకు ఏం చేస్తారు అన్న విషయాలపై దృష్టి సారించి ఐ కోడింగ్ విధానాన్ని డీకోడ్ చేసేందుకు శ్రమించారు. ఇందుకు ప్రత్యేకంగా లిపిని కూడా తయారు చేసుకుని సక్సెస్ అయ్యారు. విధ్వంసకర శక్తులు చేసే చర్యలను ముందే పసిగడితే భారతావని అంతా ప్రశాంత జీవనం సాగిస్తుందని గుర్తించిన బ్రెయిలీ లిపి, బదిరుల భాషాలా వివిధ రకాల కోడింగ్ విధానాన్ని డీ కోడ్ చేసేందుకు ప్రత్యేకంగా లిపినే తయారు చేశారు వారు. విశ్వంలో కేవలం జంతువులు మాత్రమే చెవులు ఎగిరేస్తుంటాయి కానీ కొంతమంది అంతర్జాతీయ నేరస్థులు చెవులతో కూడా సైగలు చేస్తూ కోడ్ భాషలతో తమ ముఠా సభ్యులకు అందజేస్తుంటారు. ఈ స్కూల్ విద్యార్థులు ఈయర్ కోడింగ్ ను డీకోడ్ చేసే పద్దతిని కూడా సృష్టించేశారు. కను బొమ్మలతో చాలా మంది సైగలు చేసి ఎదుటి వారి గురించి తమ వారికి చెప్పే ప్రయత్నం చేస్తుంటుంటారు. ఈ ఐబ్రో కోడింగ్ విధానంతో జరిగే ప్రక్రియ ఏంటీ వారి మనసులోని భావాలను కనుబొమ్మల ద్వారా ఎలా వ్యక్తీకరిస్తుంటారు అన్న విషయాలను వెల్లడించేందుకు దానిని డీకోడ్ చేసే పద్దతిని కూడా కనుగొన్నారు. అంతర్జాతీయ నిఘా సంస్థలకు సైతం మేము అవగాహన కల్పిస్తాం… ఆ సంస్థల ప్రతినిధులను సుశిక్షుతులగా మారుస్తామంటున్నారా విద్యార్థులు.

ఇప్పుడు లిప్ రీడింగ్…

మరో అడుగు ముందుకేసిన విద్యార్థులు ఇప్పుడు లిప్ రీడింగ్ ను స్టడీ చేసి… వారేం మాట్లాడుతున్నారో కూడా తెలుసుకునే ప్రక్రియను అందిపుచ్చుకునే పనిలో పడ్డారు. సినిమాలో చూపించినట్టుగానే పెదాల కదలికలను గమనిస్తూ వారేం మాట్లాడుతున్నారో అల్లంత దూరం నుండి గమనిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారా స్టూడెంట్స్. ఇలాంటి ఇన్నోవేషన్ ఆలోచనలను కార్యరూపంలో పెడుతున్న మహదేవపూర్ హై స్కూల్ స్టూడెంట్స్ క్రియేటివిటీని ప్రతి ఒక్కరూ ప్రొత్సహిస్తున్నారు. ఐ కొడింగ్ డీకోడ్ చేసేందుకు 9వ తరగతి చదువుతున్న సలపాల దేవిక, వొలిశెట్టి సాయి స్పందన, ఆకుతోట మల్లికలు తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటే, ఈయర్ కోడింగ్ విధానాన్ని 7వ తరగతి చదువుతున్న ఆరెందుల రాజశేఖర్, మద్దిరాల నవదీప్, ఐబ్రో రీడింగ్ ను నిట్టూరి రంజిత్, ఆరెందుల కౌశిక్ లు పసిగట్టడంలో సుశిక్షుతులయ్యారు. లిప్ రీడింగ్ పై రైయిడింగ్ చేసేందుకు బందు విశాల్ పట్టు సాధించే పనిలో పడ్డారు. వీరిలో ఈయర్ కోడింగ్ విధానంపై పట్టు సాధించిన ఆరెందుల రాజశేఖర్, ఐబ్రో రీడింగ్ ఏంటో ఇట్టే చెప్పేస్తున్న ఆరెందుల కౌశిక్ లు అన్నదమ్ముల పిల్లలు కావడం విశేషం.

వెలవెల నుండి కళకళ…

ఒకప్పుడు విద్యార్థులు రాక వెలవెలబోయిన మహదేవపూర్ స్కూల్ ఇప్పుడు ఇన్నోవేషన్ లకు వేదికగా మారగానే విద్యార్థులతో కళకళలాడుతోంది. తమ అంతరంగపు పొరల మాటున దాగిన విషయాలను వెలికితీసే పని ప్రారంభం అయిందన్న విషయం తెలియడంతో క్రమక్రమంగా ఆ పాఠశాల 260 మందితో కిటకిటలాడిపోతోంది.

ప్రముఖుల కితాబు

విద్యార్థులు తమలోని కళాత్మకతతో కూడిన డీకోడింగ్ సిస్టంపై సాధించిన పట్టును ప్రత్యక్ష్యంగా చూసిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఔరా అని అబ్బురపడిపోయారు. శనివారం కరీంనగర్ లో ఉన్న ఎంపీ బండి సంజయ్ ని కలిసిని మహదేవపూర్ చిన్నారుల ప్రతిభను చూసి దేశం గర్వించాల్సిన ఈ చిన్నారుల గురించి భారత ప్రధానికి వివరిస్తానన్నారు. క్రియేటివిటీతో వారిలో జిజ్ఞాస ఎంతో దాగుందన్నారు. ఇటువంటి చిన్నారులకు గుర్తింపునిచ్చి ప్రోత్సహించినట్టయితే ఎన్నో అద్భుతాలు సృష్టిసారన్నారు. అంతకు ముందు సైన్స్ పెయిర్ లో కూడా మన రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారి దేవసేనలు ఈ చిన్నారుల ప్రతిభను గుర్తించి బంగారు పతకం అందించారు. నిర్మల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ లో కూడా ఈ చిన్నారులు ప్రదర్శించిన తీరు గమనించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి అబ్బురపడిపోయి అక్కున చేర్చుకున్నారు.

స్వాతంత్ర్యానికి ముందే…

స్వాతంత్ర్యానికి ముందే ఏర్పడిన మహదేవపూర్ పాఠశాలలో ఎంతో మంది మేథావులు చదువుకున్నారు. 1960-70వ దశకంలో నిర్మించిన నూతన భవనాన్ని విద్యాశాఖ మంత్రి హోదాలో మంథని ఎమ్మెల్యే పివి నరసింహరావు ప్రారంభించారు. మౌనముని ప్రారంభించిన ఆ తరగతి గదుల్లో దాగి ఉన్న తెలివి తేటలను బయటకు తీసే పనిలో అక్కడే పుట్టిన బిడ్డ ఆ ప్రాంత వాసులకు విద్యా బోధన చేస్తున్నారు. బొమ్మాపూర్ వాసి మడ్క మధు ఓ వైపున విద్యాబోధన చేస్తూనే మరో వైపున విద్యార్థుల్లోని సృజానాత్మకతను బయటకు తీసే పనిలో పడ్డారు. అపారమైన జ్ఞాన సంపదను అందిపుచ్చుకున్న తమ పాఠశాల విద్యార్థులను అన్నింటా తీర్చిదిద్దడమే పనిగా పెట్టుకున్నారీ ఫిజికల్ సైన్స్ టీచర్. ఆర్థిక పితామహుడు ఢిల్లీ పీఠం ఎక్కిన తర్వాత తమ ప్రాంతానికి గుర్తింపు వస్తే… తాము మాత్రం చిరుప్రాయంలోనే దేశానికి వెలుగుదివ్వెలుగా తయారవుతామని చేతల్లోనే తమ ప్రతిభా పాటవాలను చూపిస్తున్నారా చిన్నారులు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడికి ప్రతీకలుగా మారిన ఈ చిన్నారులు దేశ రాజధానిలో తామేంటే చూపించేందుకు సిద్దంగా ఉన్నామంటున్నారు. వీరి అద్భుత సృష్టి కార్యరూపంలో దాల్చి వారి కలలు సాకారం కావాలని మనమూ ఆశిద్దాం.

You cannot copy content of this page