దిశ దశ, ఏపీ బ్యూరో:
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని బెయిలు ఇస్తున్నట్టుగా కోర్టు వెల్డడించడంతో పాటు షరతులతో కూడిన నాలుగు వారాల బెయిల్ ఇచ్చింది. 53 రోజుల క్రితం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగా ఆయన బెయిల్ కోసం సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు న్యాయవాదులు వెళ్లారు. మధ్యంతర బెయిలు పిటిషన్ పై సోమవారం కోర్టులో వాదనలు వినిపించగా జడ్జి నిర్ణయాన్ని రిజర్వూలో ఉంచారు. మంగళవారం ఉదయం బెయిల్ ఇస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన తొలి కేసులో బెయిల్ మంజూరు అయింది. అయితే చంద్రబాబు నాయుడుపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు సోమవారం మరో కేసులో ఏ3 నిందితునిగా చేర్చారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్నఆరోపణలపై ప్రివెన్షణ్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారు.